గిట్లనే చేస్తే కేంద్రంపై తిరుగుబాటు

Errabelli Dayakar Rao fires On BJP In Dharmapuri - Sakshi

సాక్షి, వెల్గటూరు(కరీంనగర్‌) : బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ‘పార్లమెంట్‌ ఎన్నికల్లో అడ్డిమారి గుడ్డి దెబ్బలా నాలుగు సీట్లలో గెలిచిన మీరు ఎగిరెగిరి పడుతున్నరు.. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తిని.. సున్నాకే పరిమితం అయ్యారు. అయినా మీ వైఖరిలో మార్పు రావడం లేదు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏనాడైనా అభివృద్ధికి సహకరించారా అని ప్రశ్నించారు.

కేంద్రం నుంచి నయా పైసా సాయం లేకున్నా.. తగాదా ఎందుకు అని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాం.. మీరు ప్రతి దాన్ని గిట్లనే రాజకీయం చేస్తే తిరగబడతామని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నేతలకు నిజంగా తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా వచ్చేలా చూడాలని, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రం నుంచి ఏటా రూ.2.30 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి పోతే.. రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు మాత్రమే వస్తున్నాయని వివరించారు. పింఛన్‌లలోనూ కేంద్రం వాటా రూ.200 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి ఏ మాత్రం సహకరించని మీకు ధర్నాలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలకు నష్టం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. 

ధర్నా ఎందుకు చేస్తున్నట్లు? 
బీజేపీ నాయకులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరైనదేనా అని ప్రశ్నించారు. మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నామని చెప్పుకోవడానికే తప్పా ప్రజలకు ఉపయోగపడవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ధర్నా చేస్తున్నారని అడిగితే ఒకరేమో యూరియా కోసమని, మరొకరు బస్సు బాధితుల కోసమని, ఇంకొకరు నీళ్ల కోసమని పొంతనలేని సమాధానాలు చెప్పడంతోనే బీజేపీ నాయకులకు క్లారిటీ లేదని తెలిసిందన్నారు. ధర్నాలు ఉనికి కోసం కాదని, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని మంత్రి హితవు పలికారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top