‘పౌల్ట్రీ’కి ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం | enthusiasm in farmers due to encouragement to 'Poultry' | Sakshi
Sakshi News home page

‘పౌల్ట్రీ’కి ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం

Jul 4 2014 12:01 AM | Updated on Mar 28 2018 11:05 AM

మండలంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రగతి కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) విరివిగా రుణాలు అందించేందుకు సంసిద్ధమైంది.

యాచారం: మండలంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రగతి కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) విరివిగా రుణాలు అందించేందుకు సంసిద్ధమైంది. పౌల్ట్రీఫాంల అభివృద్ధి కోసంనెదర్లాండ్‌కు చెందిన రోబో బ్యాంకు  డీసీసీబీ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే జిల్లాలోనే యాచారం మండలంలోని రైతులకు విరివిగా రుణాలిచ్చి పౌల్ట్రీఫాంలను అభివృద్ధిపరిచేందుకు సంకల్పించింది. మూడు నెలల క్రితం నెదర్లాండ్‌కు చెందిన రోబో బ్యాంకు ప్రతినిధులు మండలంలో పర్యటించారు.

 పౌల్ట్రీ రైతులు జీవన స్థితిగతులు, కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయం, రైతుల ఆసక్తి, బ్యాంకు రుణాల వివరాలు, బకాయిల చెల్లింపు తదితర విషయాలను అధ్యయనం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాచారం మండలంలోని చిన్న, సన్నకారు రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం, షెడ్ల నిర్మాణం చేపట్టి 5 వేలనుంచి 10 వేలకుపైగా కోళ్ల పెంపకానికి వివిధ కంపెనీలతో ఇంటెగ్రేషన్ పద్ధతిన లాభాలు పొందుతున్న విషయం తెలుసుకున్నారు. జిల్లాలో మిగతా మండలాల రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడం గుర్తించి మండలాన్ని దత్తతగా తీసుకోవడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగానే మండలంలో పలు గ్రామాల్లో పౌల్ట్రీఫాంల ఏర్పాటుపై ఔత్సాహిక రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి  నిర్ణయించారు.

 రూ.6 కోట్ల ప్రతిపాదనలు
 మండలంలోని పలు గ్రామాల రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడానికి డీసీసీబీ ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం (పీఏసీఎస్) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కొద్ది రోజులు క్రితం డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీఈఓ రాందాసు స్వయంగా ఇక్కడికి వచ్చి రైతులతో సమావేశమయ్యారు. రుణాల విషయంలో హామీ సైతం ఇచ్చారు. గతంలో పీఏసీఎస్‌ల ద్వారా 42 మంది రైతులు పౌల్ట్రీ పరిశ్రమ కోసం రూ.2 కోట్ల వరకు రుణాలు ఇచ్చారు.

 రుణాలు పొందిన 42 మంది రైతుల్లో మళ్లీ కొత్తగా పౌల్ట్రీ షెడ్లు నిర్మించుకుంటే రూ. 10 లక్షల నుంచి రూ.  20 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. వీరిలో ఇప్పటికి 30 మంది రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.  అలాగే పౌల్ట్రీ పరిశ్రమలో ఎటువంటి అనుభవం లేని రైతులకు సైతం పీఏసీఎస్ నుంచి రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. గతంలో పౌల్ట్రీఫాంల కోసం పీఏసీఎస్ నుంచి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే రుణాలిచ్చేవారు. కానీ ప్రస్తుతం రూ. 10లక్షలపైనే ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. కొత్త రైతులు ఇప్పటి వరకు 18 మంది అర్జీలు పెట్టుకున్నారు.

 నిబంధనలు పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రుణాలు విరివిగా అందజేస్తుండడంతో ఔత్సాహిక రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రానున్న రోజుల్లో మండలంలో పౌల్ట్రీఫాంల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement