అయ్యో.. దేవా !

Endowment Officers Neglect the Development Of Temple Near In Bhadrachalam - Sakshi

ఆదివాసీల దేవుడిగుడిలో అభివృద్ధి ఏది ?

బీరమయ్యకుసౌకర్యాల కొరత

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో దేవాలయం

ప్రతీ ఏటా జాతర నిర్వహిస్తున్న గిరిజనులు

పట్టించుకోని భద్రాచలం, ఏటూరునాగారం ఐడీఏ అధికారులు

వాజేడు(భద్రాచలం) : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని లొట్టిపిట్టగండి వద్ద గుట్ట ల్లో కొలువైన భీరమయ్య(భీష్మశంకరుడు)ను కొలిచేందుకు భక్తులు ఏడాదికోసారి పోటెత్తుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా సౌకర్యాల లేమితో భక్తులు అవస్థలు పడుతున్నారు. వాజేడు మండల కేంద్రం నుంచి 21 కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు గుట్ట(గాటీ)పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు(రెండు రాష్ట్రాల సరిహద్దులో) వెళ్లే రహదారిలో గుట్టపై భీరమయ్య కొలువై ఉన్నాడు. ఈ గుట్టపై అటు ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ ఎలాంటి సౌకర్యాలను కల్పించక పోవడంతో భక్తుల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి.

కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, పెద్దగంగారం, కడేకల్‌ గ్రామాలకు చెందిన గిరి జనులు భీరమయ్యను పూజిస్తున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుంచి జాత ర నిర్వహిస్తున్నారు.  జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిరిజనులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం కాని ఇటు భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు.
సౌకర్యాల లేమి..

భీష్మశంకరుడిని ఆరాధించే గిరిజనులే జాతర సమయంలో భక్తుల అవసరాల కోసం ఆయిల్‌ ఇంజన్‌ ద్వారా తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక చేతి పంపును  వేయించాలని ఎన్నిసార్లు గిరిజనులు, భక్తులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం పేరూరు ఎస్సైగా పనిచేసిన కాగితోజు శివప్రసాద్‌ చేతి పంపును రహదారి పక్కన వేయించారు. అదొక్కటే ప్రస్తుతం భక్తుల దాహార్తిని తీరుస్తోంది.
మధ్యలో నిలిచిన గుడి నిర్మాణం..

సమీపంలోని నాలుగు గ్రామాల ప్రజలు భీరమయ్యకు గుడినిర్మాణం తలపెట్టా రు. నిధుల లేమి, ఇతర కారణాలతో గుడి నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. గిరిజనులు అధికారులకు, ఐటీడీఏకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో గుడిమధ్యలోనే ఆగిపోయింది. అటు ఐటీడీఏ, ఇటు ప్ర భుత్వం నిధులను కేటాయించకపోవడంతో దానిని నిలిపివేశారు. దానికి సమీపంలో స్వామి వారిని ప్రతిష్టించిన ప్రాంతంలో చిన్నమందిరాన్ని పోలీసుల సహకారంతో నిర్మించి పూజలు చేస్తున్నారు.

నిధులు మంజూరు చేయాలి..
భీరమయ్య గుడికి 2008లో భద్రాచలం ఐటీడీఏ నుంచి రూ 25 లక్షల నిధులను కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం జరి గింది. అప్పట్లో గుడినిర్మాణంతోపాటు గుట్ట ప్రాంతంలో సౌకర్యాలు ఏర్పడుతాయని ఈ ప్రాంత ప్రజానీకం సంతో షించారు. కాని కాలక్రమేనా వాటి ఊసేలేకుండా పోయింది. దీంతో గుడికి నిధులు మంజూరు భ్రమగానే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ  ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

నిత్యం పూజలు..
రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతోపాటు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో భక్తుల తాకిడి స్వామికి ఎక్కువగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్లే ప్రతీ ఒక్కరూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లరు.

31 నుంచి 2 వరకు జాతర..
ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు భీరమయ్య జాతరను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి టేకులగూడెం గ్రామస్తులు మైక్‌ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ఈ జాతరకు గతంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపేవారు. మరి ఈ సంవత్సరం ఆ ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top