పోలీసు పదోన్నతుల వివాదానికి తెర

End of the matter to the police promotion

275 మంది ప్రమోషన్లకు ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతుల వివాదాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం పరిష్కరించారు. దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి, న్యాయ, పోలీసు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒకేసారి 275 మందికి నాన్‌ క్యాడర్‌ ఎస్పీలుగా, ఏఎస్పీలుగా, డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. దీనివల్ల 1994 బ్యాచ్‌ వరకు ప్రతి పోలీసు అధికారికి పదోన్నతి లభించనుంది.

దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శనివారం రాత్రి సంతకం చేశారు. పోలీసు అధికారుల పదోన్నతిపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రంలోనే పదోన్నతుల విషయంలో వివక్ష, గందరగోళం జరిగిందని, ఈ సమస్యను పరిష్కరించి, పదోన్నతుల్లో పారదర్శకత పాటించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయంకూడా తీసుకుని వివాదాలకు తావులేని విధంగా సమస్యను పరిష్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 139 మంది సీఐలకు డీఎస్పీలుగా, 103 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా, 33 మంది ఏఎస్పీలకు నాన్‌క్యాడర్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయాలని, అవసరమనుకుంటే సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించడానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. అంతకుముందు పోలీసు అధికారుల పదోన్నతి అంశంపై విస్తృతంగా చర్చించారు.

‘‘అర్హులైన వారందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సకాలంలో పదోన్నతి లభించాలి. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి న్యాయం జరగలేదు. వివక్ష చూపడం వల్ల కొంతమందికి అన్యాయం జరిగింది. జోన్ల వారీగా నియామకాలు జరిగినప్పటికీ రాష్ట్ర స్థాయి కేడర్‌కు పదోన్నతి కల్పించే సందర్భం లో జోన్ల నిష్పత్తి పాటించలేదు. గతంలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు ప్రమోషన్లు ఇచ్చినప్పుడు జరిగిన తప్పొప్పులను సరిదిద్ది, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలి. అన్యాయాన్ని సరిదిద్దడానికి అవసరమైనచోట సూపర్‌ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాలి.

ఇలా చేయడంవల్ల వరంగల్‌ జోన్‌లో ఇన్‌స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవచ్చు’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం, మంత్రులు  పోచారం, తుమ్మల, ఈటలæ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు  రాజీవ్‌శర్మ, చీఫ్‌ సెక్రటరీ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు అధికారుల పదోన్నతుల్లో అన్యాయాలను సరిచేసి, అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇచ్చినందుకు ఐదవ జోన్‌ కు చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top