రేపు సకల ఉద్యోగుల మహాసభ

Employees conference Tomorrow - Sakshi

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు కోసం సంఘాల ఆందోళన బాట

1.2 లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనం కోసమే పోరాటమంటున్న సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు కోసం ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఉద్యోగ సంఘాలతో మొదలైన ఆందోళన ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు పాకింది. సీపీఎస్‌ రద్దు కోసం ఏర్పాటైన సంఘాలన్నీ ఇప్పటికే నిరసన ప్రదర్శనలు, మౌన దీక్షలు, సామూహిక సెలవులు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో క్షేత్రస్థాయిలో సీపీఎస్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగులంతా తమ ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెంచారు. దాదాపు 1.2 లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశం కావడంతో అన్ని సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 25న సరూర్‌నగర్‌ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మçహాసభ నిర్వహణకు ఏర్పాట్లు చేశాయి. 

ఇదీ సీపీఎస్‌ సమస్య.. 
కేంద్రం 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం.. సీపీఎస్‌లోని ఉద్యోగికి జీపీఎఫ్‌ ఉండదు. ఇందులోని రాష్ట్ర ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదు. 2004 సెప్టెంబరు 1కి ముందు నియమితులైన వారికి జీపీఎఫ్, రుణ సదుపాయాలున్నాయి. 20 ఏళ్ల సర్వీసు తరువాత జీపీఎఫ్‌లోని 75 శాతం సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. సీపీఎస్‌లో ఆ అవకాశమే లేదు. రిటైరైన తరువాత నామమాత్రపు పెన్షనే దిక్కు. షేర్‌ మార్కెట్‌పైనే ఆధా రం. పెన్షన్‌ కోసం ఉద్యోగి 10 శాతం వాటా చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా చెల్లిస్తుంది. ఉద్యోగి రిటైరైనప్పుడు తన ఖాతాలో ఉన్న సొమ్ములో 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతం మొత్తాన్ని ఉద్యోగి పెన్షన్‌ కోసం కేంద్రం అధీనంలోని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తన వద్దే ఉంచుకుంటోంది. ఆ మొత్తాన్ని నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీస్‌ లిమిటెడ్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో పెడుతోంది. నెట్‌ అసెట్‌ వాల్యూ ప్రకారం లెక్కించి ఉద్యోగి కి పెన్షన్‌ మంజూరు చేస్తుంది. పదవీ విరమణ చేసినవారికి పెన్షన్‌ రూ.2000, రూ.2500 మాత్రమే వస్తోంది. చనిపోయిన కుటుంబాలకు కనీస ఆర్థిక సాయం కూడా దక్కదు. 

కనీసం చర్చించకపోతే ఎలా?
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం చర్చించేందుకు చర్యలు చేపట్టకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ఉద్యోగ సంఘాలన్నీ ఆందోళనబాట పట్టక తప్పలేదు. ఇందులో భాగంగానే సకల ఉద్యోగుల మహాసభ నిర్వహణకు జేఏసీ సిద్ధమైంది.  –డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top