ఆర్టీసీలో ఎన్నికల సందడి | Election Noise in RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఎన్నికల సందడి

Jul 16 2016 5:45 PM | Updated on Aug 14 2018 5:56 PM

ఆర్టీసీలో ఎన్నికల సందడి - Sakshi

ఆర్టీసీలో ఎన్నికల సందడి

జిల్లాలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కార్మిక సంఘం గుర్తింపునకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

  • ఆర్టీసీలో ఎన్నికల సందడి
  •  సాధారణ ఎన్నికలను తలపిస్తున్న వైనం
  •  మిన్నంటిన ప్రచార హోరు
  •  ఒంటరిగా బరిలోకి టీఎంయూ
  •  జత కలిసిన ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్
  • సంగారెడ్డి మున్సిపాలిటీ:  జిల్లాలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కార్మిక సంఘం గుర్తింపునకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  కార్మిక సంఘాలు సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్‌తో కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో పోటీచేసింది. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ గెలుపొందిన అనంతరం రెండుగా విడిపోయాయి.

    ఈసారి నిర్వహించే ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం) ఒంటరిగా పోటీ చేస్తోంది. ఎంప్లాయీస్ యూనియన్ ఈ సారి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్‌తో కలిసి పోటీ చేస్తోంది. టీఎం యూ ఆవిర్భవించిన ఏడాది కాలంలోనే ఆర్టీసీలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘంగా పేరొందింది. మిత్రపక్షమైన ఎంప్లాయీస్ యూనియన్‌తో విభేదాలు తలెత్తడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి జిల్లా కావడంతో పాటు యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్న మంత్రి హరీశ్‌రావు కూడా జిల్లాకు చెందిన వారే కావడంతో ఈసారి జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీఎం యూ రీజినల్ కన్వీనర్ పీరయ్య, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇప్పటికే డిపోల వారీగా గేటు మీటింగ్‌లు నిర్వహించారు.

    గతంలో మాదిరిగా జిల్లాలోని 7 డిపోల్లో క్లాస్-6తో పాటు క్లాస్-3లో కూడా టీఎంయూ గెలుపు కోసం కార్మికుల మద్దతు కూడగట్టుకుంటున్నారు.  గతేడాదిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వేతన సవరణ కోసం సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే. కార్మికులు ఊహించిన దాని కంటే 42 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం టీఎంయూకు కలిసివచ్చే అవకాశముంది. దాంతో పాటు కొన్నేళ్లుగా నిలిచిపోయిన కారణ్య నియామకాలు, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి రెగ్యులరైజ్ చేయడంతో పాటు పదోన్నతులు కల్పించండం కలిసొచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. టీఎంయూ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈ ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌తో కలిసి పోటీ చేస్తున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అంజాగౌడ్ తెలిపారు. మొత్తంగా ఆర్టీసీలో కురుక్షేత్రాన్ని తలపించేలా కార్మిక సంఘాల నాయకులు ప్రచారాలను నిర్వహిస్తున్నారు.

     గెలుపు మాదే
    19న జరిగే ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో తాము క్లాస్-3, క్లాస్-6లలో అధిక మెజారిటీ గెలుపొందితీరుతాం.  జిల్లాలోని 7 డిపోల్లో తమ యూనియన్ గెలుపొందుతుంది. 2,400 ఓట్ల ఆధిక్యంతో క్లాస్-3లో గెలుస్తాం.
     -  పీరయ్య, టీఎంయూ రీజినల్ కన్వీనర్

     కార్మిక వ్యతిరేక విధానాలే గెలుపునకు నాంది
     టీఎంయూ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలే తమ గెలుపునకు దోహదపడతాయి. జిల్లాలోని 7 డిపోల్లో మెదక్, జహీరాబాద్, దుబ్బాక, గజ్వేల్‌లలో బలంగా ఉన్నాం. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో సైతం టీఎంయూకు గట్టి పోటీనిస్తాం.   
     - అంజాగౌడ్, ఈయూ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement