ఓటర్లకు ఫొటో స్లిప్పులు | Sakshi
Sakshi News home page

ఓటర్లకు ఫొటో స్లిప్పులు

Published Sat, Nov 24 2018 11:23 AM

Election Commission First Time Photo Slips Giving To The Voters - Sakshi

సిరిసిల్ల : పోలింగ్‌ శాతం పెంచేందుకు, బోగస్‌ ఓటర్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి ఓటరు చిత్రపటంతో కూడిన పోల్‌స్లిప్పు(చీట్టీ)లను పంపిణీ చేస్తోంది. గతంలో ఎన్నికల్లో అభ్యర్థులు మాత్రమే పోల్‌చిట్టీలు పంపిణీ చేసేవారు. తర్వాత ఎన్నికల అధికారులు పోల్‌చిట్టీలు అందించారు. తొలిసారి ఓటరు ఫొటోలు ముద్రించిన పోల్‌ స్లిప్పులను అందిస్తున్నారు. పోలింగ్‌ శాతం పెరగడంతోపాటు, ఎలాంటి తడబాటు లేకుండా ఓటర్లు ఆ స్లిప్పుతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ముద్రణలో ఫొటోస్లిప్పులు..
జిల్లాలోని 506 పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన ఫొటో ఓటరు స్లిప్పులను ఎన్నికల అధికారులు ముద్రిస్తున్నారు. ఇప్పటికే తుది ఓటరు జాబితా వెల్లడించిన ఎన్నికల అధికారులు.. ఎన్నికల నిర్వహణలో ఎంతోకీలకమైన ఓటరు ఫొటో స్లిప్పులను ముద్రిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4,08,769 మంది ఓటర్లకు స్లిప్పులను అందించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. బూత్‌ లెవల్‌ అధికారులు(బీఎల్‌వో)ల ద్వారా క్షేత్రస్థాయిలో పోలింగ్‌ కేంద్రా ల వారీగా ఫొటో ఓటరు గుర్తింపు స్లిప్పులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ స్లిప్పు ఉంటే చాలు.. ఓటరు నేరుగా పోలింగ్‌ కేం ద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు.

ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు వంటి ఇతర ఫొటో గుర్తింపు కార్డులు అవసరం లేదు. ఈఫొటో ఓటరు గుర్తిం పు కార్డులో ఓటరు జాబితాలో క్రమసంఖ్య, పో లింగ్‌ స్టేషన్‌ నంబరు, ఓటరు ఫొటో ఉండడంతో ఓటు వేసేందుకు నేరుగా అవకాశం ఉంటుంది. బీఎల్‌వోలు అందించిన ఈ స్లిప్పు తప్పిపోతే.. మళ్లీ పాతపద్ధతిలోనే ఓటరు గుర్తింపు కార్డుతోనే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయవచ్చు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా కొత్తగా ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణికి శ్రీకారం చుట్టింది.

బ్యాలెట్‌లో అభ్యర్థుల గుర్తులు.. ఫొటోలు
గతఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన  గుర్తులతోపాటు, అభ్యర్థుల ఫొటోలను కొత్తగా ముద్రిస్తున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలు, ఇతర సామగ్రి ప్రింటింగ్‌ చేయించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 506 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. సిరిసిల్లలో 13 మంది, వేములవాడలో 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వేములవాడలో మరో అభ్యర్థి బరిలో ఉంటే.. అంటే 16 మంది ఉండి ఉంటే.. ఈవీఎంలపై నోటాకు చోటు ఉండకపోయేది. కానీ ఒక్క అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నిజానికి ఈవీఎంలపై 16 గుర్తులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వేములవాడలో 15 మంది అభ్యర్థులు, నోటాతో కలిపితే 16 అవుతుంది. దీంతో అదనపు ఈవీఎంల ఏర్పాటు లేకుండానే ఒకే ఈవీఎం ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు అవసరమైన ఎన్నికల సామగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మొదటిదశ ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తికాగా.. బ్యాలెట్‌ పత్రాలు వచ్చిన తర్వాత మరోసారి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫొటో స్లిప్పులతో ప్రయోజనం 
ఓటర్లకు ఫొటో స్లిప్పులు ఇవ్వడం ద్వారా బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. ఓటరు ఇంటికే స్లిప్పు చేరుతుంది. దానిపై ఫొటో, ఓటరు సంఖ్య ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేకుండా నేరుగా వెళ్లి ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఫొటో ఉంటుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది సులభంగా గుర్తు పడతారు. ఓటింగ్‌ శాతం పెరిగేందుకు ఈ స్లిప్పులు దోహదపడతాయి. 
– టి.శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో

Advertisement
Advertisement