‘ముసద్దిలాల్‌’పై మనీలాండరింగ్‌ కేసు | Sakshi
Sakshi News home page

‘ముసద్దిలాల్‌’పై మనీలాండరింగ్‌ కేసు

Published Fri, Apr 19 2019 1:11 AM

ED seizes gold jewellery worth over  82 cr from Musaddilal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్‌ విక్రయాలకు పాల్పడిన కేసులో ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కొరడా ఝళిపించింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీ సులు మొత్తం రూ. 110.85 కోట్ల గోల్‌మాల్‌కు సంబంధించి చార్జిషీట్‌ దాఖలు చేయగా తాజా గా ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ముసద్దీలాల్‌తోపాటు దాని అనుబంధ సంస్థలు, కుంభకోణంతో ప్రమేయమున్న సంస్థలు, కైలాష్‌ గుప్తా సహా కొందరు యజమానుల ఇళ్లపై బుధ, గురువారాల్లో వరుస దాడులు చేసింది. ఈ సోదాల్లో లభించిన రూ. 82.11 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని సీజ్‌ చేసినట్లు ఈడీ అధికారులు గురువారం వెల్లడించారు. ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. 

ఐటీశాఖ ఫిర్యాదుతో బయటపడ్డ స్కాం 
2016 నవంబర్‌ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడగా ముసద్దిలాల్‌ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల కేంద్రంగా ‘విక్రయాల’స్కెచ్‌ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ. 97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌ రసీదులు సృష్టించింది. బోగస్‌ రసీదులతోపాటు కస్టమర్ల వివరాలంటూ కొందరి ఆధార్‌ కార్డుల నకళ్లను జత చేసింది. వినియోగదారుల పాన్‌ నంబర్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రతి లావాదేవీని రూ. 2 లక్షలలోపు చూపింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఎస్‌బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సెస్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపుపన్నుశాఖ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యాజమాన్యం సమర్పించిన గుర్తింపుపత్రాలకు చెందిన వ్యక్తులను పోలీసులు విచారించగా ఆ రోజు తాము బంగారమేదీ కొనలేదని వారు చెప్పారు. ముసద్దిలాల్‌ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నోట్ల రద్దు రోజున కేవలం 67 మంది వినియోగదారులే వచ్చినట్లు వెల్లడైంది. అలాగే బిల్లులన్నీ నోట్ల రద్దు తేదీ తర్వాతే నమోదయ్యాయని పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ను విశ్లేషించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించింది. దీంతో సంస్థ మోసం బయటపడింది.

అరెస్టును  తప్పించుకునేందుకూ ప్రయత్నాలు
సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముసద్దిలాల్‌ యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. ఏకంగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) రికార్డుల్నీ తారుమారు చేసింది. ముసద్దిలాల్‌ సంస్థలకు డైరెక్టర్లుగా కైలాష్‌ చంద్‌ గుప్తా, ఆయన కుమారులు నితిన్‌ గుప్తా, నిఖిల్‌ గుప్తా, కోడలు నేహాగుప్తా ఉండగా వారి పేర్లు మారుస్తూ రికార్డులు సృష్టించింది. మరోవైపు నల్లధనాన్ని వ్యాపారం రూట్‌లో డిపాజిట్‌ చేయడానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచింది. ముసద్దిలాల్‌ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై సీసీఎస్‌ పోలీసులు దృష్టి పెట్టగా రూ. 80 కోట్ల మేర అష్టలక్ష్మీ గోల్డ్, శ్రీ బాలాజీ గోల్డ్‌ సంస్థల ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఆ డబ్బుతో ఆయా సంస్థల నుంచి హోల్‌సేల్‌గా బంగారం కొన్నట్లు కాగితాల్లో చూపారని నిర్ధారించారు. ఇందుకు సహకరించినందుకు ఆయా వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన కైలాష్‌చంద్‌ గుప్తా, ఆయన కుమారులు సహా మొత్తం 10 మంది నిందితులు, ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్, అనుబంధ సంస్థలపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. దీని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ... ఈ స్కాంలో లబ్ధి పొందిన డబ్బుతో ముసద్దిలాల్‌ యాజమాన్యం 270 కేజీల బంగారం ఖరీదు చేసి వ్యాపారం చేసినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే బుధ, గురువారాల్లో హైదరాబాద్, విజయవాడల్లో  యజమానుల ఇళ్లలో సోదాలు జరిపి భారీగా బంగారం సీజ్‌ చేసింది. 

Advertisement
 
Advertisement