దారెటు?!

Early Elections On Suspense Mahabubnagar Politics - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రాజకీయంగా ఇన్నాళ్లు ఆధిపత్యం ప్రదర్శించిన టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి రాజుకుంటోంది. ముందుస్తు ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీని రద్దు చేయడం, రాబోయే ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థులను గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అభ్యర్థుల విషయంలో సిట్టింగ్‌లందరికీ అవకాశం కల్పించడంతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి కూడా టిక్కెట్లు ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల బరిలో నిలవాలని కొండంత ఆశలు పెట్టుకున్న ఆశావహులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అనుచరుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండడంతో ఏం చేయాలో అసంతృప్తులకు దిక్కుతోచడం లేదు. కొన్ని చోట్ల టిక్కెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకు అనుగుణంగా ముఖ్య అనుచరులు, నమ్మకస్తులతో రెండు రోజులుగా రహస్య సమావేశాలు జరుపుతున్నారు. కొన్ని చోట్ల స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుండగా.. టీఆర్‌ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లయింది.

అక్కడ నో ప్రాబ్లం 
ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అసంతృప్తి జాడలకు తావు లేదనే చెప్పాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తర్వాత మరే ఇతర నాయకులు ఎదగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో అసంతృప్తికి అవకాశం లేకుండా చూసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 2014 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. వీటితో పాటు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మక్తల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలుపొందిన ఎస్‌.రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలదే హవా కొనసాగింది. వీటితో పాటు వనపర్తి నియోజకవర్గంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి సైతం తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఇలా మొత్తం మీద గట్టి అభ్యర్థులు ఉన్న చోట్ల అసంతృప్తి లేదనే చెబుతున్నారు.
 
సమస్య అంతా ఇక్కడే.. 
పాలమూరు ప్రాంతంలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కొన్నిచోట్ల తలనొప్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఈ సమస్య రావొచ్చని చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, అలంపూర్, గద్వాల, కొడంగల్‌ నియోజకవర్గాలతో పాటు మక్తల్‌లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు. కల్వకుర్తిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన జైపాల్‌యాదవ్‌కే ఈసారి కూడా టీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించింది. దీంతో అక్కడి నుంచి టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి వర్గాలు చీలిపోయారు.

దీంతో టిక్కెట్టు దక్కించుకున్న జైపాల్‌యాదవ్‌ పార్టీ ముఖ్యనేతలను మద్దతు కోరుతున్నారు. అలాగే అలంపూర్‌లో ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన డాక్టర్‌ అబ్రహంకు టిక్కెట్‌ ప్రకటించారు. అయితే ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన మందా జగన్నాథం లేదా ఆయన కుమారుడు మందా శ్రీనాథ్‌ తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. వీరు టిక్కెట్‌ దక్కించుకున్న అబ్రహంకు సహకరిస్తారా లేదా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక గద్వాల నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌గా ఉన్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి టిక్కెట్‌ దక్కినా ఇతర నేతలు అసంతృప్తికి గురవుతున్నట్లు తెలుస్తోంది. గద్వాలలో ఈసారి బీసీ అభ్యర్థికి టిక్కెట్‌ ఇవ్వాలని అందులోనూ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆంజనేయులు గౌడ్‌ గట్టి ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో గద్వాలలో కూడా గ్రూపు తగాదాలు నెలకొనగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక కొడంగల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి టిక్కెట్‌ దక్కకపోవడంతో ఆయన వర్గం కూడా అసంతృప్తిగా ఉంది.
  
ద్వితీయశ్రేణిలో అసంతృప్తి 
రాష్ట్రంలో 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకున్నారు. ఈ మేరకు మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్, టీడీపీల నేతలు భారీగా గులాబీ జెండా కిందకు వచ్చారు. అయితే, పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని సదరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కొందరిని మాత్రమే ప్రోత్సహిస్తూ.. ఇతరులను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఉంది. ఇలా మొత్తం మీద నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలే రెండు, మూడు వర్గాలుగా ఏర్పడ్డారు. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న నేతలు, కాంగ్రెస్‌ నేతలు, టీడీపీ నేతలు ఇలా ఏ పార్టీ నుంచి వచ్చారో అలాగే గ్రూపులను కొనసాగించారు. ప్రస్తుతం అవే గ్రూపులు బరిలో నిలిచే అభ్యర్థులకు తలనొప్పిగా మారనున్నాయి. తాజాగా దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీ కుంట మండలం జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఎంపీపీ క్రాంతి గ్రూపుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా మొత్తం మీద అసంతృప్తుల బెడదతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆదిలోనే సతమతమవుతున్నారు. 

అసంతృప్తులకు గాలం 
రాబోయే ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కుతుందని బోలెడు ఆశలు పెట్టుకుని నిరాశకు గురైన అసంతృప్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. నిరాశలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలను గాలం వేసేందుకు ఇతర రాజకీయపక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అలంపూర్‌లో నిరాశగా ఉన్న మందా కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ గాలం వేస్తున్నట్లు వినికిడి. ఢిల్లీ స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయని నాలుగైదు రోజుల్లో ఏదో ఒక విషయం తేలే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే విధంగా కొడంగల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని స్వంత గూటికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే కొందరు దూతలు చర్చలు జరుపుతున్నారని, ఇవి త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top