పైకం కొట్టు.. ‘ప్రైమరీ’ పట్టు! | Each school is charged Rs 25 to 50 thousand | Sakshi
Sakshi News home page

పైకం కొట్టు.. ‘ప్రైమరీ’ పట్టు!

Nov 27 2017 3:07 AM | Updated on Nov 27 2017 3:07 AM

సాక్షి, హైదరాబాద్‌: ప్రీ ప్రైమరీ స్కూళ్ల అనుమతుల ప్రక్రియ కొందరు విద్యాధికారులకు కాసులు కురిపిస్తోంది. ప్రీ ప్రైమరీ స్కూల్‌కు గుర్తింపు తప్పనిసరి చేయడంతో జిల్లా విద్యాధికారులకు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.  ఈ క్రమంలో అనుమతుల వ్యవహారం దారితప్పుతోంది. పక్కా పరిశీలన నిర్వహించి గుర్తింపు ఇవ్వాల్సిన అధికారులు నిబంధనలు పట్టించుకోకుండా వసూళ్లకు పాల్పడుతూ ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేస్తున్నారు.

ఆ మూడు జిల్లాల్లో..: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో దాదాపు 6 వేలకుపైగా ప్రైవేటు ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ పాఠశాలలన్నీ ప్రీ ప్రైమరీ స్కూల్‌ అనుమతులు పొందాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా పాఠశాలలు ప్రీ ప్రైమరీ గుర్తింపు కోసం ఇప్పటికే దరఖాస్తులు సమర్పించా యి. వీటిని పరిశీలిస్తున్న విద్యా శాఖ అధికారులు ఏకధాటిగా వందల సంఖ్యలో అను మతులు జారీ చేస్తున్నారు. వాస్తవానికి పాఠశాల గుర్తింపు ఇచ్చే క్రమంలో నిబంధ నల ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకా రం సౌకర్యాలుంటేనే అనుమతులివ్వాలి. కానీ ప్రీ ప్రైమరీ పాఠశాలల విషయంలో విద్యా శాఖ అధికారులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలకు స్వస్తి పలుకుతూ కాగితాలను పరిశీలించి అనుమతులు జారీ చేసేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో గతవారం ఏకంగా 400పైగా స్కూళ్లకు ప్రీ ప్రైమరీ అనుమతులు జారీ చేసినట్లు తెలిసింది. మరో 200 స్కూళ్లకు సంబంధించి అనుమతులు త్వరలో జారీ చేయనున్నట్లు సమాచారం.

వేటు పడినా మారని తీరు: పాఠశాలల గుర్తింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన మేడ్చల్‌ జిల్లా విద్యా శాఖ అధికారి ఉషారాణిపై ప్రభుత్వం గతవారం సస్పెన్షన్‌ వేటు వేసింది.  సస్పెన్షన్‌ అంశం ఇతర జిల్లా అధికారుల్లో కొంత ఆందోళన కలిగించినా పెద్దగా ప్రభావం చూపలేదు. అయినా ప్రీ ప్రైమరీ స్కూళ్ల అనుమతుల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మేడ్చల్‌ జిల్లాలో ఒక ప్రీ ప్రైమరీ స్కూల్‌ అనుమతికి రూ.25 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేసి అనుమతులిచ్చినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే తరహాలో అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నారు. హైదరాబాద్‌తోపాటు ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్న జిల్లాల్లోనూ అనుమతుల పేరిట భారీగా వసూళ్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement