కేంద్రం పరిమితులతోనే రైతులకు ఇక్కట్లు

E services start in marketing - Sakshi

     వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి

     మార్కెటింగ్‌లో ఈ–సర్వీసెస్‌ ప్రారంభం..  

సాక్షి, హైదరాబాద్‌: పంటల ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మార్కెటింగ్‌ ఈ–సర్వీసెస్‌ను ప్రారంభించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. కేంద్రం మద్దతు ధర పెంచిందని, అయితే కొనుగోళ్ల విషయంలో పరిమితులు విధిస్తోందని.. దీనివల్లే రైతులకు సమస్య ఎదురవుతోందని చెప్పారు. రెండేళ్ల నుంచి రికార్డు స్థాయిలో ప్రభుత్వం తరఫున కొంటున్నామన్నారు. కేంద్రం పరిమితి విధించడానికి ఎగుమతి దిగుమతి విధానాలు తదితర అంతర్జాతీయ కారణాలున్నాయన్నారు. అయితే ఇవి రైతులకు సంబంధం లేనివి అయినప్పటికీ వారిపైనే ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ విషయాలు రైతులకు అధికారులు వివరించాలన్నారు. మార్కెటింగ్‌శాఖ ఆందుకు సిద్ధంగా ఉండాలని, ధరల విషయంలో ముందుగానే అంచనాలు వేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. 

ప్రతీసారి సమీక్షించుకోవాలి.. 
వ్యవసాయ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చేరుతాయని, వాటి ధరలో రైతు వాటా ఏడాదికేడాది ఎంత పెరుగుతుందనేది ముఖ్యమని పార్థసారథి చెప్పారు. ప్రతిసారీ దీన్ని సమీక్షించుకుని రైతులకు గిట్టుబాటు కల్పిస్తున్నామా లేదా చూసుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం తరఫున సాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లలో గత నాలుగేళ్లలో రూ.370 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఈ సర్వీసెస్‌ ఉపయోగపడుతోందన్నారు. అన్నీ ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ–నామ్‌లో రాజకీయ ఒత్తిడులు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా మోడల్‌ యాక్ట్‌ విషయంలో జవాబుదారీతనం ఉండాలని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, పద్మహర్ష తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top