వాన... వాన.. వెనక్కు! | Crops are drying up by lack of rain in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వాన... వాన.. వెనక్కు!

Aug 10 2025 2:25 AM | Updated on Aug 10 2025 2:25 AM

Crops are drying up by lack of rain in Andhra Pradesh

అన్నమయ్య జిల్లాలో దుక్కి దున్ని.. వర్షాలు లేక ఖాళీగా వదిలేసిన పొలం

ఖరీఫ్‌ను వెంటాడుతున్న వర్షాభావం 

సీజన్‌ ప్రారంభమై 2 నెలలైనా ముందుకుసాగని సాగు

26.89 శాతం లోటు వర్షపాతం..12 జిల్లాల్లో తీవ్ర లోటు 

వర్షాధార ప్రాంతాల్లో జాడలేని పంటలు 

రాయలసీమలో పరిస్థితి మరీ దారుణం 

వేరుశనగను దెబ్బతీసిన బెట్ట పరిస్థితులు 

14.30లక్షల ఎకరాలకు గాను 3.30లక్షల ఎకరాల్లోనే సాగు 

అదును దాటిపోవడంతో వేరుశనగ రైతుల గగ్గోలు 

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టిపెట్టని ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతూ రైతాంగం అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం రోజురోజుకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో ప్రాజెక్టుల కింద తప్ప వర్షాధారిత ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పంటల సాగు లేదు. వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

రాయలసీమ జిల్లాల్లో ఈ సీజన్‌లో ప్రధాన పంట వేరుశనగ కనీసం 24 శాతానికి మించి సాగవ లేదంటేనే ఎంతటి దైన్యం నెలకొందో తెలుస్తోంది. మరొక వైపు వేసవిని తలపించే స్థాయిలో నమోదుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో వేసిన పంటలు సైతం ఎండిపోతున్నా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి సారించడంలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తుకోసం పెట్టిన పెట్టుబడులు నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. మరొక వైపు ప్రాజెక్టుల కింద సాగవుతున్నా శివారు ప్రాంతాలకు సాగునీరందక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 

12 జిల్లాలో లోటు వర్షపాతం.. 
జూన్‌ 1 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ సాధారణానికి మించి వర్షాలు పడలేదు. ఈ సీజన్‌లో 57.47 సెంటీమీటర్ల వర్షపాతం పడాలి. ఆగష్టు 7వ తేదీ నాటికి 28.70 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 20.98 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.  దాదాపు 70 రోజుల్లో  26.89 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

14 జిల్లాల్లో సాధారణ, 12 జిల్లాల్లో 20–59 శాతం వరకు లోటు నెలకొంది. డాక్టర్‌ వైఎస్సార్‌ కడప, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతిజిల్లాలలో లోటు నుంచి తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు 360 మండలాల్లో  లోటు వర్షపాతం కొనసాతోంది. 145 మండలాల్లో ఒకటి కంటే ఎక్కువ డ్రై స్పెల్స్‌ నమోదైనట్లు చెబుతున్నారు. 

52 శాతం విస్తీర్ణంలో పంటలు 
ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రధాన ప్రాజెక్టుల కింద  సాధారణ సాగు నమోదైంది. అయితే ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాలువ శివారు భూములకు నీరందించలేని దుస్థితి నెలకొంది. వర్షాభావంతో చిన్న సాగునీటి ప్రాజెక్టుల కింద నీరందక రైతులు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు లక్ష్యం 86.47 లక్షల ఎకరాలు కాగా, 40.45 లక్షల ఎకరాల్లో పంటలు (52 శాతం) సాగయ్యాయి. 

పొరుగనున్న తెలంగాణాలో కూడా ఇదే రీతిలో వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్ధేశించిన లక్ష్యంలో 69.11 శాతం తొలిపంట సాగైంది. ప్రాజెక్టుల కింద వరి, పత్తి సాగు కాస్త సాధారణ స్థాయిలో సాగవుతోంది. ఖరీఫ్‌లో వరి, వేరుశనగ, పత్తి పంటలే 80 శాతం విస్తీర్ణంలో సాగవుతాయి. 

ఆ తర్వాత చెప్పుకో తగ్గ స్థాయిలో కందులు, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. అలాంటిది ఈ ఏడాది వరి సాగు లక్ష్యం 38.87 లక్షల ఎకరాలు కాగా,  20 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తి సాగు లక్ష్యం 14.10 లక్షల ఎకరాలు కాగా, 8 లక్షల ఎకరాల్లో సాగైంది. తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో కందులు 3.42 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 2.92 లక్షల ఎకరాల్లో వేశారు.  

ఆశలు సన్నగిల్లిన వేరుశనగ 
–24 శాతం మించి సాగవని పంట 
ఖరీఫ్‌లో వరి తర్వాత వర్షాధారం కింద ఎక్కువగా సాగయ్యే పంట వేరుశనగ. రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట. కానీ, ఈ ఏడాది పావు వంతు కూడా సాగవలేదు. ఇదొక్క ఉదాహరణ చాలు.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవడానికి. రాయలసీమలో 70–80 శాతం విస్తీర్ణంలో పండించే పంట వేరుశనగనే. ఈ ఏడాది లక్ష్యం 14.30 లక్షల ఎకరాలు కాగా, 3.30 లక్షల ఎకరాల్లో (24 శాతం) మాత్రమే సాగైంది. 

నిరుటి కంటే (6.87 లక్షల ఎకరాలు) కూడా ఇది దాదాపు సగమే కావడం గమనార్హం. సాధారణంగా జూలై నెల దాటితే వేరుశనగ వేసేందుకు రైతులు ముందుకురారు. ప్రధానంగా అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పంట ఈ సారి జాడ లేకుండా పోయింది. దాదాపు ఏడు జిల్లాల్లో సెంటు భూమిలో కూడా వేరుశనగ విత్తలేదు. 

నంద్యాలలో మాత్రమే 57 శాతం విస్తీర్ణంలో సాగైంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 8, వైఎస్సార్‌ కడపలో 15, శ్రీ సత్యసాయిలో, అనంతపురంలో 27, తిరుపతిలో 31, పల్నాడులో 17, ప్రకాశంలో 21 శాతం మేర పంట వేశారు. నంద్యాలలో వర్షాభావ పరిస్థితులతో పంట ఎండిపోయింది. వేరుశనగ సాధారణ విస్తీర్ణంలో కూడా సాగకపోతే తీవ్రమైన పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. పాడి మీద ఆధారపడే చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. 

నిరుడు గిట్టుబాటు దూరం.. ఈసారి మిరపకు దూరం 
నిరుడు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూసిన మిరప రైతులు ఆ పంట వేసేందుకు ముందుకురాని పరిస్థితి. సాధారణంగా ఖరీఫ్‌లో 5–6 లక్షల ఎకరాల మధ్య మిరప సాగవు తుంది. ఈసారి లక్షన్నర ఎకరాలు దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఓవర్‌ ఆల్‌గా చూస్తే ఏ ఒక్క జిల్లాలోనూ 40 శాతం  విస్తీర్ణంలో పంటలు సాగవని పరిస్థితి నెలకొంది. 

ప్రదానంగా అనకాపల్లిలో ఏడు శాతం, అన్నమయ్యలో 10 శాతం, చిత్తూరులో 12 శాతం, ప్రకాశంలో 14 శాతం, వైఎస్సార్‌ కడపలో 19 శాతం,  బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 21 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 29 శాతం, విజయనగరం జిల్లాలో 38 శాతం, అల్లూరి సీతారామరాజులో 41, గుంటూరులో 42 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదీ? 
సీజన్‌ ప్రారంభమై రెండు నెలలైనా రాయలసీమ జిల్లాల్లో సగటున 20 శాతానికి మించి పంటలు సాగవలేదు. ఆగస్టులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాధార జిల్లాల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఈపాటికే  ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ప్రకటించాలి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయలేదు. సీఎం చంద్రబాబు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కానీ సమీక్ష చేసిన పాపాన పోలేదు. 

90 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు ఇవ్వాలి 
కనీస వర్షాల్లేక ఖరీఫ్‌లో రైతులు తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 12 జిల్లాల్లో మైనస్‌ 20 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదవగా, 7 జిల్లాల్లో 10 శాతం లోటు వర్షపాతం నమోదైంది.  తెలంగాణలో 69.11 శాతం పంటలు సాగైతే.. ఏపీలో 52 శాతం విస్తీర్ణంలోనే వేశారు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నప్పటికీ శివారు భూములకు అందని పరిస్థితి నెలకొంది. 

వర్షాభావంతో వరి, పత్తి  పంటలు దెబ్బతింటున్నాయి. తీవ్ర వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికపై దష్టిపెట్టాలి. 90 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించాలి. యూరియా కొరత ఎక్కువగా ఉంది. వాస్తవ నిల్వలతో కూడిన బోర్డులను మండల స్థాయిలో ప్రదర్శించాలి. 
        –ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌  

శివారు ప్రాంతాలకు సాగనీరందక రైతుల పాట్లు 
గోదావరి, కృష్ణ, సాగర్‌ ప్రాజెక్టుల్లో పుష్కలంగా సాగునీరు ఉంది. కానీ శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగునీరందని పరిస్థితి నెలకొంది. సాగునీటి సరఫరా నిర్వహణలో ప్రభుత్వానికి ముందు చూపు కొరవడడంతో శివారు ప్రాంత రైతులు విత్తుకున్న పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 
-ఎం.హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement