మార్చినాటికి 'డబుల్‌' | Sakshi
Sakshi News home page

మార్చినాటికి 'డబుల్‌'

Published Sat, Dec 29 2018 3:31 AM

Double Bedroom Houses Distribution By March  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇపుడు వాటి అమలును వేగిరపరచాలని పట్టుదలగా ఉంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 16 పార్లమెంటు స్థానాల్లో విజయావకాశాలు మెరుగవ్వాలంటే సంక్షేమ పథకాల అమలు మరింత పకడ్బందీగా జరపాలన్న దిశగా అడుగులు వేస్తోంది. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌లపై సీఎం దృష్టి సారించినట్లు సమాచారం.

మార్చినాటికి వీలైనన్ని పంపిణీ.. 
మార్చిలోగా వీలైనన్ని ఇళ్లు పూర్తి చేసి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవ్వాలని అధికారపార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. రైతు బంధు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలను ప్రజలకు చేరువ చేసిన ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ల విషయంలో మాత్రం వెనకబడిందనే చెప్పాలి. వాస్తవానికి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ప్రధాన హామీ. ఇపుడు కూడా దీనికి అంతే ప్రాధాన్యం ఉంది. దీనికితోడు ఇటీవల ఎన్నికల్లో సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఆగస్టు 31నాటికి రాష్ట్రవ్యాప్తంగా 13వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యా యి. ఈ నేపథ్యంలో మార్చినాటికి వీలైనన్ని ఎక్కు వ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచిస్తోంది ప్రభుత్వం. తద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్న ప్రణాళికతో ముందుకువెళ్తోంది. 

ప్రభుత్వ రద్దుతో మందగించిన వేగం 
వాస్తవానికి ఈ పథకం ప్రారంభమే ఆలస్యమైంది. 2014లో ప్రభుత్వం కొలువుదీరినా.. 2016 మొద ట్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని పట్టాలెక్కించింది.ఆ ఏడాది కేవలం 864 ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగింది. దీంతో ప్రజలు, ప్రతిపక్షాల నుంచి  ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఎన్నికలకు ఇంకా సమయముందని ఈ విషయంలో ప్రభుత్వం ఇళ్ల వేగంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.  సెప్టెంబర్‌ 6న ప్రభుత్వం రద్దు కావడంతో వీటి నిర్మాణ వేగం మందగించింది. దసరాకు వీలైనన్ని ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చూసినా.. సాధ్యం కాలేదు. 2018 ఆగస్టు 31 వరకు హౌసింగ్‌ శాఖ గణాంకాల ప్రకారం.. 13,927 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.2,461 కోట్లు వెచ్చించింది. మొత్తం 1.6 లక్షల ఇళ్లను 2018 మార్చినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పోటెత్తుతున్న దరఖాస్తులు..
రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. డబుల్‌ బెడ్‌రూమ్‌లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తాకిడి అధికంగా ఉంది. ఇంటిజాగా ఉన్న వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న ప్రకటనతో రాజధాని హైదరాబాద్‌లో 3 లక్షలు, జిల్లాల్లో దాదాపు 4 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లుగా సమాచారం. ప్రతీసోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణిలోనూ ఈ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఈసేవా– మీసేవా కేంద్రాల ద్వారానూ దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. 

Advertisement
Advertisement