బర్డ్‌ఫ్లూతో భయాందోళన వద్దు | dont afraid of bird flu says chicken company officials | Sakshi
Sakshi News home page

బర్డ్‌ఫ్లూతో భయాందోళన వద్దు

Apr 21 2015 8:05 PM | Updated on Sep 3 2017 12:38 AM

బర్డ్‌ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చని తెలంగాణ రాష్ట్ర కోళ్ల సమాఖ్య అధ్యక్షులు ఇ.ప్రదీప్‌కుమార్ రావు అన్నారు.

చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చు
కోళ్ల పరిశ్రమ వ్యాపారులు, సంఘాల నేతలు

హైదరాబాద్: బర్డ్‌ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చని తెలంగాణ రాష్ట్ర కోళ్ల సమాఖ్య అధ్యక్షులు ఇ.ప్రదీప్‌కుమార్ రావు అన్నారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. బర్డ్‌ఫ్లూ వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికే కాస్తోకూస్తో సోకే ప్రమాదం ఉందని.. అయితే చికెన్ తిన్నవారికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఈ వైరస్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే చనిపోతుందన్నారు. మన దేశంలో గుడ్లు, చికెన్ వంటకాలను 100 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికిస్తామని.. అందువల్ల బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్న చికెన్ తిన్నప్పటికీ ఏమాత్రం ప్రమాదం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.


రాష్ట్రంలో ప్రతీ నెల 4 కోట్ల కేజీల చికెన్, 3 కోట్ల గుడ్ల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మొదటిస్థానంలో ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు బర్డ్‌ఫ్లూ ప్రకటించారని... అయితే రాష్ట్రంలో ఇప్పుడు మూడు రోజుల్లోనే పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ముఖ్యమంతి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌లు చొరవ తీసుకున్నారన్నారు. తొర్రూరులోనూ ఇప్పుడు బర్డ్‌ఫ్లూ లేదన్నారు. ఈ నెల 17వ తేదీ నాటికే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. 10 కిలోమీటర్ల పరిధి ప్రాంతాన్ని పూర్తిగా పారిశుద్ధ్య, బర్డ్‌ఫ్లూ లేని ప్రాంతంగా ప్రకటించారన్నారు.


పశుసంవర్థకశాఖ అధికారులు శాంపిళ్లు సేకరించి బెంగళూరు పంపించి అక్కడ పరీక్షించాక తర్వాత భోపాల్ ల్యాబ్‌కు పంపించాక నిర్ధారణ జరుగుతుందన్నారు. అప్పుడే బర్డ్‌ఫ్లూనా కాదా ? అన్న నిర్ధారణ జరుగుతుందన్నారు. కాబట్టి అనవసర ప్రచారాలు నమ్మవద్దని వినియోగదారులను కోరారు. లక్షలాది కుటుంబాలు కోళ్ల పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయన్నారు. అయితే బర్డ్‌ఫ్లూ ప్రచారం వల్ల హైదరాబాద్‌లో 20 శాతం వరకు పౌల్ట్రీ అమ్మకాలు పడిపోయిన విషయం వాస్తవమేనని.. కానీ జిల్లాల్లో మాత్రం ఎటువంటి ప్రభావం పడలేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి అన్ని పరిశీలించి మన అధికారుల చర్యలకు సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. కె.జి.ఆనంద్ మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement