ప్రభుత్వ వాహనాలను వాడొద్దు..

Do not Use public Vehicles Says State Election Commission - Sakshi

మావోల నుంచి ప్రాణహాని ఉన్నవారికే మినహాయింపు 

పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసే వరకు నిషేధం 

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వాహనాలను వినియోగించే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. సీఎంతో పాటు మావోయిస్టులతో ప్రాణ హాని ఉన్న రాజకీయవేత్తలకు మాత్రమే వాడేలా నిబంధనలు రూపొందించింది. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, తటస్థంగా జరిగేందుకు వీలుగా ప్రభుత్వ వాహనాలను వారు తప్ప ఇంకెవరూ వాడకూడదని తాత్కాలికంగా నిషేధం విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాయింట్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్స్, స్థానిక సంస్థలు, జిల్లా ప్రజా పరిషత్‌లు/మండల ప్రజాపరిషత్‌లు, మార్కెటింగ్‌ బోర్డులు, సహకార సంఘాలు, స్వయం ప్రతిపత్తి గల జిల్లా కౌన్సిలర్లకు చెందిన ట్రక్కులు, లారీలు, టెంపోలు, జీప్‌లు, కార్లు, రిక్షాలు, బస్సులు వేటిని కూడా ప్రచారానికి వినియోగించకూడదని స్పష్టం చేసింది.

కేంద్ర,రాష్ట్ర మంత్రులు సహా ఈ సంస్థలకు చెందిన ఏ ఒక్కరు కూడా ఈ వాహనాలను అధికారిక పర్యటనల నెపంతో కానీ, డబ్బు చెల్లించి కానీ ప్రచారానికి, ఎన్నికల పర్యటనలకు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. పోలింగ్‌ ముగిసే వరకు ఈ వాహనాల వినియోగంపై జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నిబంధనలను అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపింది. 

అనుమతి తీసుకోవాలిలా.. 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనాలకు అనుమతులను సబ్‌ కలెక్టర్‌/ఆర్డీవో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయి నేతలు (స్టార్‌ క్యాంపెయినర్లు) మాత్రం ప్రచార వాహనాల కోసం అనుమతులను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. గురువారం ఈ మేరకు పీఆర్‌ కమిషనర్‌కు ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ లేఖ రాశా రు. గతంలో పోటీచేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం కోసం వాహనాల అనుమతి అధికారం ఆర్డీవోలకు ఉండగా తాజాగా దాన్ని మార్చేశారు. రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల నేతలు ఆర్డీవో వద్ద వాహనాల అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని ఈ మేరకు మార్పులు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top