సజ్జనార్‌పై ‘సందేశాల’ ఒత్తిడి! 

Disha Murder Case: Sajjanar Received above 2500 Missed calls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ ఓ రకంగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై కొంత ఒత్తిడి తగ్గించిందనే చర్చ పోలీస్‌ వర్గాల్లో జరుగుతోంది. సజ్జనార్‌కు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరుండడం, ఇప్పుడు ఘటన జరిగిన పరిధికి కూడా ఆయనే పోలీస్‌ బాస్‌ కావడంతో నిందితుల ఎన్‌కౌంటర్‌ జరుగుతుందని కొందరు ఊహించారు. మరికొందరు ఏకంగా సీపీ సజ్జనార్‌కే ఫోన్‌ చేసి చెప్పేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. గత వారం రోజుల్లో సజ్జనార్‌ మొబైల్‌కు 2,500కు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయంటే ఈ ఘటన తర్వాత ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చని పోలీస్‌ వర్గాలంటున్నాయి. 

ప్రతి నిమిషం ఆయన ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. సీపీ సజ్జనార్‌కే కాదు ఆయన సతీమణి ఫోన్‌కు కూడా వందల సంఖ్యలో మెసేజ్‌లు వచ్చాయని, నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనే భావన ఆ మెసేజ్‌ల్లో వ్యక్తమైందని అంటున్నారు. అలా ఎస్‌ఎంఎస్‌ లు, వాట్సాప్‌ మెసేజ్‌లు పంపిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సజ్జనార్‌ ఎవరితో చర్చించకుండా రహస్యంగానే ఉంచి ఒత్తిడిని భరించారని పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఓవైపు కేసు విచారణ, దర్యాప్తు, ప్రభుత్వ వర్గాల నుంచి సహజంగా ఉండే ఒత్తిడికి తోడు పౌర సమాజం డిమాండ్లను తట్టుకున్న సజ్జనార్‌ నిందితులకు చట్టపరం గా శిక్ష పడాలనే దర్యాప్తు కొనసాగించారని అంటున్నారు. అనుకోకుండా ఎన్‌కౌంటర్‌ జరిగిందని, దీనిని పౌరసమాజం హర్షించడంతో  సజ్జనార్‌కు మానసికంగా ఊరట కలిగినట్టేననే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది.

చదవండి:

దిశనిందితుల ఎన్కౌంటర్

మృగాడైతే.. మరణ శిక్షే!

ఆరున్నర గంటలు ఇలా...

దిశతిరిగిన న్యాయం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top