మృగాడైతే.. మరణ శిక్షే!

Story of two accused ended with their encounters - Sakshi

నాడు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్‌ దాడి కేసు.. 

నేడు షాద్‌నగర్‌లో దిశపై అత్యాచారం, హత్య కేసు 

ఎన్‌కౌంటర్లతో ముగిసిన రెండు ఘటనల నిందితుల కథ

వరంగల్‌ జిల్లాలో మూడు ఘటనలలో ఇదే తీర్పు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మనిషి మృగాడిగా మారితే మరణ శిక్షే సరి.. కరడుగట్టిన నేరాలకు పాల్పడే మానవ మృగాల పట్ల పోలీసుల వైఖరిని సమాజం హర్షిస్తోంది. పదేళ్ల కిందట 2008 డిసెంబర్‌ 8న వరంగల్‌లో ప్రణీత, స్వప్నికపై యాసిడ్‌ దాడి.. నవంబర్‌ 27న షాద్‌నగర్‌ చటాన్‌పల్లి వద్ద దిశపై అత్యాచారం, హత్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు... తదుపరి విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. 2008 డిసెంబర్‌ 13న ‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌’కోసం మామూనూరు పోలీసు క్యాంపు సమీపంలో నిందితులను విచారిస్తుండగా పోలీసుల నుంచి ఆయుధాలు తీసుకుని దాడికి ప్రయత్నించడం.. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితులు శాఖమూరి శ్రీనివాసరావు, బజ్జూరి సంజయ్, పోతరాజు హరికృష్ణ మృతి చెందారు. తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ రెండు ఘటనలకు బాధ్యులైన మానవ మృగాలకు మరణశిక్షే పడింది. మగాళ్లు మృగాళ్లుగా మారితే ఇక అంతేనన్న విషయాన్ని నేరగాళ్లకు నేరుగా చెప్పారు. కాగా 2008 డిసెంబర్‌ 13న వరంగల్‌లో జరిగిన ఘటన సమయంలో సజ్జనార్‌ ఎస్పీగా ఉండగా.. ప్రస్తుతం సైబరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న ఆయన ఈ రెండు సంఘటనలలో కీలకంగా వ్యవహరించారు. 

వరంగల్‌లో మొత్తం మూడు ఘటనలు.. 
పదేళ్ల కాలంలో వరంగల్‌ జిల్లాలో మూడు దారుణ ఘటనలు జరగ్గా.. అందులో నిందితులకు చావే శరణ్యమైంది. రెండు సంఘటనలు సజ్జనార్‌ హయాంలో జరగ్గా.. మరో ఘటన సౌమ్యామిశ్రా ఎస్పీగా ఉన్నప్పుడు జరిగింది. 2008 డిసెంబర్‌లో హసన్‌పర్తి మండలం భీమారం వద్ద యాసిడ్‌ దాడి జరిగింది. కిట్స్‌ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతపై శాఖమూరి శ్రీనివాస్‌ మ రో ఇద్దరితో కలసి దాడి చేశాడు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసు కోగా.. సాక్ష్యాల సేకరణ సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌ చేయడం తో ముగ్గురూ మృతి చెందారు. మహిళలపై వేధింపులకు పాల్పడటంతో కరడుగట్టిన రౌడీషీటర్లుగా మారిన గడ్డం జగన్‌ అలియాస్‌ జయరాజ్, ఎ.రత్నాకర్‌ను 2008 అక్టోబర్‌ 2008న ‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌’కోసం ఉర్జుగుట్ట ప్రాంతంలో విచారిస్తున్న సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ మరణించారు. వరంగల్‌కు చెందిన పత్తి వ్యాపారి కుమార్తె మనీషాను 2008లో కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్రా ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లను అర్థం చేసుకుని కేసులో ముందుకు సాగారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతుండగా.. నిందితులు టి.రాజు, ఎల్‌.అశోక్, బి.నరేశ్‌లు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. 

అదే డిసెంబర్‌... అదే సజ్జనార్‌ 
∙ 2008 డిసెంబర్‌ 13న ముగ్గురు యాసిడ్‌ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ 
∙ అప్పుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్‌ 
∙ మళ్లీ 2019 డిసెంబర్‌ 6న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ 
∙ ప్రస్తుతం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top