చర్లపల్లి టు చటాన్‌పల్లి 

Minute To Minute Update Of Encounter In Disha Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ అత్యాచారం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిందితుల కస్టడీ, కేసు దర్యాప్తు అంశాలను సైబరాబాద్‌ పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. తదుపరి విచారణ నిమిత్తం నలుగురు నిందితులను చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి కస్టడీలోకి తీసుకోవడానికి, పది రోజుల పాటు విచారించడానికి అనుమతిస్తూ షాద్‌నగర్‌ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే రెండు రోజుల పాటు జైల్లోనే నిందితుల్ని విచారించిన పోలీసులు గురువారం రాత్రి మాత్రమే బయటకు తీసుకొచ్చారు. చర్లపల్లి–చటాన్‌పల్లి మధ్య ఆరున్నర గంటల పాటు సాగిన ప్రక్రియలో ఆ నలుగురూ హతమయ్యారు. నిందితులు ఎవరి కంటా పడకుండా ఉండటానికి పోలీసులు తమ వాహనాల్లోని వెనుక సీటుకు, ముందు సీటుకు మధ్య వారిని పడుకోపెట్టి ప్రయాణించారు. చర్లపల్లి–చటాన్‌పల్లి మధ్య ఎప్పుడు ఏం జరిగిందంటే... 

గురువారం రాత్రి 11.50
దిశ కేసులో నలుగురు నిందితుల్నీ జైలు అధికారులు సైబరాబాద్‌ పోలీసు కస్టడీకి అప్పగించారు.  

గురువారం అర్ధరాత్రి 12.10 
నిందితుల్ని జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన ప్రత్యేక బృందాలు వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని బయలుదేరాయి.  

శుక్రవారం తెల్లవారుజాము 1.15 
పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా దాదాపు 50 కి.మీ. ప్రయాణించిన ఈ ‘కాన్వాయ్‌’తొండుపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది.  

తెల్లవారుజాము 1.45 
అరగంట పాటు అత్యాచారం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేసిన పోలీసులు ఆపై నిందితుల్ని తీసుకుని షాద్‌నగర్‌ పోలీసుస్టేషన్‌కు బయలుదేరారు. 

తెల్లవారుజాము 3.40 
షాద్‌నగర్‌ స్టేషన్‌లో విచారణ తరువాత నలుగురినీ ఒకే వాహనంలో తీసుకుని హతురాలి సెల్‌ఫోన్‌ రికవరీ చేయడానికి బయలుదేరారు. 

తెల్లవారుజాము 4.00 
నలుగురు నిందితుల్ని తీసుకుని 10 మంది పోలీసులతో కూడిన బృందం చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ వద్దకు చేరుకుంది.  

తెల్లవారుజాము 5.30 
సెల్‌ఫోన్‌ అక్కడ పాతిపెట్టాం.. ఇక్కడ పాతిపెట్టాం.. అంటూ పలుచోట్లకు తిప్పిన నిందితులు పోలీసులపై రాళ్ల దాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం మొదలెట్టారు. 

తెల్లవారుజాము 5.45
లొంగిపోమంటూ పోలీసులు చేసిన హెచ్చరికల్ని నిందితులు బేఖాతరు చేయడంతో ఆత్మరక్షణకు పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. 

శుక్రవారం ఉదయం 6.15
నిందితుల నుంచి స్పందన ఆగిపోవడంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.  

ఉదయం 6.25 
నలుగురూ హతమైనట్లు గుర్తించిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top