
వివక్షే!
సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది...
సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆడశిశువు అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. దీంతో భ్రూణ హత్యలు జరిగి ఆడపిల్లల నిష్పత్తి పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలను కాపాడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ పథకం తోనైనా తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతుందేమోనని, ఆడ శిశువుల ఉనికికి ప్రమాదం తప్పుతుందేమోనని ఆశాభావం వ్యక్తమవుతోంది.
బతికించుకుందాం !
* ఏటేటా తగ్గిపోతున్న ‘బంగారు తల్లులు’
* అన్ని రంగాల్లో రాణిస్తున్నా చిన్నచూపే
* ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పై ‘కోటి’ ఆశలు
కామారెడ్డి : జిల్లా జనాభాలో మహిళలు అగ్రభాగా న ఉంటే, ఆరేళ్లలోపు ఆడ పిల్లల జనాభా దానికి వ్య తిరేకంగా ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 23,45,685 ఉండగా, అందులో పు రుషులు 11,62,905మంది, మహిళలు 11,82,780 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళల జనాభా 19,875 మంది ఎక్కువగా ఉంది. అదే ఆ రేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే మగ పిల్లలు 1,72,278 మంది, ఆడపిల్లలు 1,65,151 మంది ఉన్నారు. అంటే ఆడపిల్లల జనాభా 7,127 మంది తక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కలను పరిశీలిస్తే జిల్లా జనాభా 25,51,335 మంది కాగా, పురుషులు 12,50,641 మం ది, మహిళలు 13,00,694 మంది ఉన్నారు. ఇక్కడ మగవారికన్నా మహిళలు 50,053 మంది ఎక్కువగా ఉన్నారు.
అదే ఆరేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే మొత్తం పిల్లలు 2,82,417 మంది ఉండగా, మగ పిల్లలు 1,44,977 మంది ఉండగా, ఆడపిల్లలు 1,37,440 మంది ఉన్నారు. అంటే మగపిల్లల కన్నా ఆడపిల్లలు 7,537 మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లా జనాభాలో మహిళలు ఎక్కువగా ఉంటే పిల్లల విషయానికి వస్తే తక్కువగా ఉండడం వివక్షను ఎత్తిచూపుతోంది. 2001లో వెయ్యి మంది మగ పిల్లలకు 959 మంది ఆడపిల్లలు ఉండగా, 2011లో వెయ్యి మంది మగపిల్లలకు 948 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు.
చదువులోనూ..
ఆడపిల్లపై వివక్ష విద్యలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తల్లిదండ్రులు మగ పిల్లలను ప్రైవేటు బడులకు, ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. ఆడపిల్ల ఎంత చదివినా అత్తారింటికి వెళ్లేదే కదా అనే ధోరణి చాలా మందిలో పోవడం లేదు. ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో ఈ విషయం స్పష్టంగా వెళ్లడైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1లక్షా43 వేల మంది ఆడపిల్లలు చదువుతుండగా, 1లక్షా 28 వేల మంది మగపిల్లలు చదువుతున్నారు. అదే ప్రైవేటు పాఠశాలల్లో 1 లక్ష 8 వేల మంది మగ పిల్లలు చదువుతుంటే, ఆడపిల్లలు కేవలం 73 వేల మంది మాత్రమే చదువుతున్నారు. అంటే ఆడపిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది.
బేటీ బచావోపై ‘కోటి’ ఆశలు
గతంలో ఎన్నో పథకాలు వచ్చినా అవి ప్రజలను చైతన్యవంతులని చేయలేకపోయాయి. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్న రోజుల్లోనూ వివక్ష మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలను కాపాడుకుందామంటూ దేశ ప్రధాని మోడీ ఇటీవల ‘బేటా బచావో..బేటీ పడావో’ పేరిట చేపట్టిన కార్యక్రమం అందరినీ ఆలోచింపజేస్తోంది. బేటీ బచావో..బేటీ పడావో కార్యక్రమం కింద స్త్రీ, పురుష నిష్పత్తి పెరిగిన గ్రామాలకు రూ. కోటి రూపాయల గ్రాంటును ప్రకటించారు. అ లాగే ఆడపిల్ల పేరిట చేసే డిపాజిట్లకు అధిక వడ్డీ ఇస్తారు. ఇలాంటి ప్రోత్సాహాల ద్వారా ఆడపిల్లల పట్ల సమాజంలో సానుకూలమైన మార్పు వచ్చేందుకు దోహదపడే విధంగా విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నైనా ఆడపిల్లలపై ఉన్న వివక్ష తగ్గుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆడ, మగ సమానమనే ధోరణి పెరగాలి
ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణి స్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న నేటి రోజుల్లోనూ వివక్ష కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల పెంపకం నుంచే ఆడ అయినా మగ అయి నా సమానంగా చూడడం తల్లిదండ్రులు అలవర్చుకోవాలి. పెం పకం, చదువు, ఇంకా అన్ని విషయాల్లో ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థితికి ఎదుగుతారు.సమాన అవకాశాలు ఇద్దరికీ క ల్పించాలి. సమానంగా చూసే రోజులుగా రావాలి. పరిస్థితి ఇలా గే ఉంటే రాబోయే రోజుల్లో మాన వ మనుగడకు తీవ్రమైన సంక్షో భం తలెత్తుతుంది.
-సుమిత్రానంద్,ఉపాధ్యాయురాలు
ఆడపిల్లలతోనే భవిష్యత్తు
సృష్టిలో ఆడ, మగ సరిసమానం. ఆడపిల్లపై వివక్ష చూపుతూ గర్భంలోనే తుంచడం ద్వారా మనకు మనమే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తూ అగ్రభాగాన నిలుస్తున్నారు. ఆడ అయినా, మగా అయినా ఒక్కటనే భావన పెంచుకుని ఆడపిల్లలను ప్రోత్సహించాలి. ఆడ పిల్లలను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఆడపిల్లల కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆడపిల్లల్ని చదివిస్తే వారు కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడుతారు.
-సంధ్యారాణి,సీడీపీవో, కామారెడ్డి