‘డిండి’పై సభలో దుమారం

Dindi to be linked with Palamuru-RR LI project at any cost: Harishrao - Sakshi

‘పాలమూరు’తో అనుసంధానించొద్దు: ఎమ్మెల్యే వంశీచంద్‌

రాజకీయ అశాంతి నెలకొంటుందని మంత్రులే చెప్పారని వ్యాఖ్య

తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి హరీశ్‌రావు

సభలో నల్లగొండ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేరెందుకని నిలదీత

కాంగ్రెస్‌ పార్టీది కుటిలనీతి అని మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ అంశంపై గురువారం శాసనసభ కాసేపు అట్టుడికింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో దీన్ని అనుసంధానించకుండా వేరుగా చేపట్టాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గతంలో ఇదే విషయమై సీఎంకు లేఖ రాశారంటూ కాంగ్రెస్‌ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ ప్రాజెక్టుపై 10 నిమిషాలకుపైగా ఆయన ప్రశ్నలు వేయడంతో వంశీ మైక్‌ కట్‌ కావడం, ఆయన పోడియంలోకి దూసుకెళ్లడం, మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగడంతో సభ గరంగరంగా సాగింది.

శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని..
ప్రశ్నోత్తరాల సందర్భంగా వంశీచంద్‌ మాట్లాడుతూ ‘‘డిండికి శ్రీశైలం నుంచే నీటిని తీసుకుంటామని జీవో ఇచ్చారు. 2015లో శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అలైన్‌మెంట్‌ కూడా ఖరారు కాలేదు. అప్పుడు శ్రీశైలం ఫోర్‌షోర్‌ అని చెప్పి ఇప్పుడు పాలమూరుకు అనుసంధానించారు. మేమే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పాలమూరుతో అనుసంధానిస్తే రాజకీయ అశాంతి నెలకొంటుందని మంత్రులు ఆందోళన వెలిబుచ్చారు’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో వంశీచంద్‌ మైక్‌ను స్పీకర్‌ మధుసూదనాచారి కట్‌ చేసి అధికార పార్టీ సభ్యుడు గువ్వల బాలరాజుకు ఇచ్చారు. దీంతో వంశీచంద్‌ నిరసన వ్యక్తం చేశారు. అయినా స్పీకర్‌ మైక్‌ ఇవ్వకపోవడంతో వంశీ పోడియంలోకి దూసుకెళ్లగా ఆయనకు స్పీకర్‌ మైక్‌ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిండికి వేరుగా నీటిని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనం
వంశీచంద్‌ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి సభలోనే కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి డిండిపై చర్చ జరుగుతుంటే జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతిరెడ్డి సభలో లేరు. కాంగ్రెస్‌ నేతలు జిల్లాకో మాట మాట్లాడుతున్నారు. ఇది వారి కుటిలనీతి’’అని దుయ్యబట్టారు. డిండి ప్రాజెక్టు ఆలస్యంపై ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించాల్సింది గాంధీభవన్‌లో కానీ సభలో కాదని విమర్శించారు. ‘‘ఆ పార్టీ నేతలు హర్షవర్దన్‌రెడ్డి, పవన్‌కుమార్‌లు గండుపిల్లి కూడా లేని దగ్గర పెద్ద పులులున్నాయని, ఆముదం మొక్క కూడా లేనిచోట మహా వృక్షాలు ఉన్నాయని ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేశారు. నిజంగా నీళ్లు రావాలని కాంగ్రెస్‌ కోరుకుంటే మొదట కేసులు ఉపసంహరించుకొని ప్రాజెక్టుకు సహకరించాలి’’అని సూచించారు.

ప్రజాధనం వృథా కావొద్దనే.. : హరీశ్‌
శ్రీశైలం నుంచి డిండికి నీటిని వేరుగా తీసుకుంటే అదనంగా పంప్‌హౌస్, సర్జ్‌పూల్‌ వంటి నిర్మాణాలతో అధిక మొత్తం ఖర్చవుతుందని, దీనికితోడు భూసేకరణ, ఇతర అనుమతులతో ఆలస్యం జరుగుతుందని హరీశ్‌రావు పేర్కొ న్నారు. ఈ దృష్ట్యా పాలమూరులో భాగంగా నిర్మిస్తున్న పంప్‌హౌస్‌ ద్వారానే 2 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 1.5 టీఎంసీలను పాలమూరు అవసరాలకు, మరో 0.5 టీఎంసీ డిండి అవసరాలకు మళ్లించాలని నిర్ణయించామని, దీని ద్వారా ప్రజాధనం వృథా కాదన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎలాంటి నష్టం ఉండదని, అన్ని జిల్లాలకు సమానంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. కృష్ణాలో రాష్ట్రానికి కేటాయింపులు పెరగనున్నాయన్నారు.

‘డిండి’కి వ్యతిరేకం కాదు మీడియాతో వంశీచంద్‌
డిండి ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో అనుసంధానించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నాం తప్ప డిండి ప్రాజెక్టును కాదని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గర ఆయన మాట్లాడుతూ డిండి ప్రాజెక్టును పాలమూరుతో అనుసంధానం చేస్తే మహబూబ్‌నగర్‌ జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసనసభలోనే అబద్ధాలు చెప్పారని విమర్శించారు. డిండితో పాలమూరు ప్రాజెక్టును అనుసంధానిస్తే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాజకీయ అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top