ప్రత్యేక ఓటింగ్‌తోనే దళితుల అభివృద్ధి

Development of Dalits with special voting - Sakshi

అప్పుడే దళితులకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం

శంకరన్‌ స్మారకోపన్యాసంలో మార్టీన్‌ మెక్వాన్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను అందించడం లేదని, రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రతిపాదించిన ప్రత్యేక ఓటింగ్‌ ద్వారా మాత్రమే దళితులకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని దళిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు, రాబర్ట్‌ కెనడీ అవార్డు గ్రహీత మార్టీన్‌ మెక్వాన్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ 7వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెక్వాన్‌ స్మారకోపన్యాసం చేస్తూ.. ప్రస్తుత ఎన్నికల విధానంలో నిజమైన దళిత ప్రతినిధులు ఎన్నిక కావడం లేదని, అత్య«ధిక ఓట్లు దళితేతరులవే కావడంతో దళితుల సమస్యలను పరిష్కరించడంలో రిజర్వుడ్‌ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని చెప్పారు. దళిత ప్రతినిధులకు దళితులు మాత్రమే ఓటు వేసుకునే విధానాన్ని సపరేట్‌ ఎలక్టోరేట్‌ అంటారని, 1932లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్‌ ఇచ్చిన కమ్యూనల్‌ అవార్డును మహాత్మా గాంధీ వ్యతిరేకించడం వల్ల ఇప్పుడు అమలులో ఉన్న రాజకీయ రిజర్వేషన్ల విధానం వచ్చిందని తెలిపారు. అప్పటికే ముస్లింలకు, ఆంగ్లోఇండియన్లకు ఇటువంటి ప్రత్యేక ఓటింగ్‌ విధానం అమలులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

గుజరాత్‌లో దయనీయం..
ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న గుజరాత్‌లో దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో ఉమ్మడి నీటి వనరులను వినియోగించుకునే స్వేచ్ఛ దళితులకు లేదని, వేలాది గ్రామాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని చెప్పారు. దళిత ప్రజాప్రతినిధులు వారి పార్టీ, నాయకత్వానికే విశ్వసనీయంగా ఉంటున్నార ని, దీనికి ఇప్పుడున్న ఓటింగ్‌ విధానమే కారణమని అభిప్రాయపడ్డారు. ఎస్‌ఆర్‌ శంకరన్‌ లాంటి అధికారులు దళితుల కోసం చేసిన సేవలను భవిష్యత్‌ తరాలు, ప్రస్తుత అధికార యంత్రాంగం మార్గదర్శకంగా తీసుకోవాలని మెక్వాన్‌ సూచించారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. శంకరన్‌ లాంటి నిబద్ధత కలిగిన అధికారి పాలనా సమయంలో తాము ఉండటం, ఆయనతో సన్నిహితంగా ఉండటం ఒక చక్కటి అనుభూతిగా భావిస్తున్నామని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని, శంకరన్‌ ఒక్క ఏడాదిలోనే 120కిపైగా జీవోలపై సంతకాలు చేయడం, అవన్నీ దళితుల అభ్యున్నతికి సంబంధించినవే కావడం ప్రపంచంలోనే అరుదైన దృశ్యంగా భావించాల్సి ఉంటుందని చెప్పారు.

దళితుల కోసమే ఆయన జీవితం
సభకు అధ్యక్షత వహించిన సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. పేదలు, ఆదివాసీల కోసం, దళితేతర సమాజంలోని చాలా మంది వ్యక్తులు పనిచేసారని, కానీ దళితుల కోసం జీవితమంతా ధారబోసిన ఏకైక వ్యక్తి శంకరన్‌ అని కొనియాడారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ శంకరన్‌ గారి స్ఫూర్తి వల్లనే ఐఏఎస్‌ అధికారిగా నిబద్ధతతో కూడిన కార్యాచరణను కొనసాగించానని, అటువంటి వ్యక్తితో చివరికంటా స్ఫూర్తిని పొందుతూ వచ్చానని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ వైవీ సత్యనారాయణ స్వాగతోపన్యాసం చేస్తూ.. శంకరన్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. ఎస్సీ హాస్టల్‌లో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన పేద దళిత బాలికకు ఏటా ఇచ్చే లక్ష్మీవేణుగోపాల్‌ అవార్డును అన్వేషి కార్యదర్శి డాక్టర్‌ కె.లలిత వనపర్తి జిల్లాకు చెందిన సి.ఆశకు అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top