ఆర్గానిక్‌ అటెన్షన్‌

designer santhosh designs in pune fashion week - Sakshi

పుణె ఫ్యాషన్‌ వీక్‌లో ఆర్గానిక్‌ దుస్తులు ప్రదర్శించిన సిటీ డిజైనర్‌ సంతోష్‌ 

ఆకట్టుకున్న నయా కలెక్షన్‌

 ఇప్పుడంతా నేచురల్‌ ట్రెండ్‌. తినే తిండే కాదు...ధరించే దుస్తులూ సహజసిద్ధంగా రూపొందించినవే కావాలనే శ్రద్ధఅందరిలోనూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్‌ దుస్తులు మార్కెట్లోకి రాగా... ఇప్పుడిప్పుడే సిటీ డిజైనర్లు కూడా ఆర్గానిక్‌ దుస్తులకు అడ్రెస్‌గా మారుతున్నారు. సిటీ యువ డిజైనర్‌ సంతోష్‌ ఇటీవల జరిగిన పుణె ఫ్యాషన్‌ వీక్‌లో పూర్తిస్థాయి ఆర్గానిక్‌ దుస్తులను ప్రదర్శించి... అగ్రగామి ఫ్యాషన్‌ వేదికలపై ఇలాంటి కలెక్షన్‌ను ప్రదర్శించిన తొలి సిటీ డిజైనర్‌గా ఘనతసాధించాడు. ఈ సందర్భంగా సంతోష్‌ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... 

సాక్షి, సిటీబ్యూరో : మనం ధరించే ప్రతిది రకరకాల రసాయనాలు వినియోగించి తయారు చేసిందే. తెల్లని కాటన్‌ దుస్తుల తయారీలోనూ ఆ రంగు కోసం కెమికల్స్‌ వాడతారు. రసాయనరహితంగా పూర్తి ఆర్గానిక్‌ దుస్తుల తయారీ అనేది కొంత సాహసంతో కూడిన ప్రయోగమేనని చెప్పాలి. ఇదే పుణె ఫ్యాషన్‌ వీక్‌ నిర్వాహకులను ఆకట్టుకుంది.

పుణె భేష్‌ అనే.. 
దేశంలోని అగ్రగామి ఫ్యాషన్‌ ఫెస్టివల్స్‌లో ఒకటైన పుణె ఫ్యాషన్‌ వీక్‌లో నా డిజైన్స్‌కు మంచి ఆదరణ లభించింది. అక్కడికి వచ్చిన వారంతా నాకన్నా దాదాపు 10ఏళ్లు సీనియర్స్‌. ఆర్గానిక్‌ వర్క్‌ అనేది అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు మాత్రమే సాహసించేది కావడంతో మంచి ప్రశంసలు వచ్చాయి. నా డిజైన్స్‌కు అక్కడి ఆంగ్ల పత్రికల్లో వచ్చినరివ్యూల ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహించే మరో 4 ఫ్యాషన్‌ వీక్స్‌లో అవకాశాలు నా తలుపు తట్టాయి. అందరూ అనుకున్నట్టు ఇవేవీ అంత ఖరీదైనవి కూడా కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.1,000లోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ప్రజకల్లో అవగాహన పెరగాల్సి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఏటా ఆర్గానిక్‌ దుస్తుల తయారీని ప్లాన్‌ చేస్తున్నాను. నా షోలలో తప్పకుండా ఒక సీక్వెన్స్‌ దీనికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను.   

షేడ్స్‌ తక్కువ.. సమయం ఎక్కువ  
దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్‌ నేచురల్‌ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ, ఏవీ 100 శాతం ఆర్గానిక్‌ అని చెప్పలేం. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. ఆర్గానిక్‌ దుస్తులకు కాటన్, లెనిన్, పట్టు... ఫ్యాబ్రిక్స్‌ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటితో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. పుణె ఫ్యాషన్‌ వీక్‌ కోసం నేను రూపొందించినఆర్గానిక్‌ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్‌ మొత్తం చేనేతలనేవినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్‌ సొసైటీ ఆధ్వర్యంలోడాక్టర్‌ సునంద ఈ ఫ్యాబ్రిక్స్‌ తయారీ చేయించారు.

అదే విధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లను ఉపయోగించి ఆకుపచ్చ, బ్లూ, ఎల్లో, బ్రిక్‌ షేడ్స్‌తో రంగులు సృష్టించాం. కొంచెం డల్‌ ఫినిష్‌ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక
డిజైనింగ్‌ వర్క్‌ జత చేసి ఆకట్టుకునేలా డ్రెస్సులను తీర్చిదిద్దాం. మొత్తం 20 డ్రెస్సులను తయారు చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రదర్శించాను. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top