యువకుడి పైశాచికత్వం.. చిత్రహింసలు పెట్టిన వైనం
హైదరాబాద్: స్నేహితురాలిపై పైశాచికత్వం చూపించాడో యువకుడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి.. మధ్య వేలు గోర్లు కత్తిరించి, కత్తెరతో ఆమెపై తీవ్రంగా దాడిచేశాడు. పోలీసులకు, ఇతరులు ఎవరికైనా చెబితే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు నగరానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులతో సగంలోనే కోర్సును ఆపేసింది. అనంతరం ల్యాంకోహిల్స్ వద్ద ఓ ప్రైవేట్ సంస్థలో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తూ సోమాజిగూడ, కపాడియా లైన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంది. ఆమె పనిచేసే సంస్థలోనే విధులు నిర్వహించే బీఎన్ రెడ్డి నగర్ పరిధలోని చైతన్యనగర్‌కు చెందిన ఎ.భానుప్రకాష్‌తో పరిచయం అయింది. అతను వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని ప్రేమలోకి దింపాడు.
ఈ క్రమంలో విభేదాలు మొదలై భానుప్రసాద్ బాధితురాలిని తరచూ వేధించడం, కొట్టడం, బెదిరించడం చేస్తుండే వాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 26వ తేదీన రాత్రి 2:30కి బాధితురాలు ఉండే ఫ్లాట్‌కి వచ్చి ఆమె రూమ్ మేట్స్‌ను సైతం బెదిరించి..గదిలో బంధించి బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అంతే కాకుండా కత్తెరతో దాడి చేశారు. దీంతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురికాగా..మరుసటి రోజు స్నేహితులతో కలిసి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భానుప్రకాష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


