డెంగీ డేంజర్‌..వణికిస్తున్నఫీవర్‌

Dengue Danger in Hyderabad - Sakshi

నగరాన్ని వణికిస్తున్న విషజ్వరాలు  

పంజా విసురుతున్న డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డిప్తీరియా, డయేరియా  

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్‌ ఆస్పత్రులకు బాధితుల క్యూ  

మూడు రోజుల వ్యవధిలో డెంగీతో ఐదుగురి మృతి  

ఒక్కో ఆస్పత్రిలో 40–50 మంది బాధితులు  

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన వైద్యారోగ్య శాఖ  

వైద్య సిబ్బంది సెలవులు రద్దు  

సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రుల సమీక్ష  

పాఠశాలల్లో ప్రతిరోజూ ఫాగింగ్‌ చేయాలని ఆదేశం  

విద్యాసంస్థల్లో నివారణ చర్యలు చేపట్టాలని హెచ్చార్సీలో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు  

బొప్పాయి, కీవీ పండ్ల ధరలకు రెక్కలు  దోమ తెరలకు డిమాండ్‌

ఆందోళన చెందవద్దు: మంత్రి ఈటల

విశ్వనగరం విషజ్వరాలతో వణికిపోతోంది. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డిప్తీరియా,డయేరియాలు పంజా విసురుతుండడంతో విలవిల్లాడుతోంది. ఓవైపు డెంగీ దోమమృత్యుఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ఏజెన్సీ దోమ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది డెంగీతో మరణించగా... వారిలో 40 మందికి పైగా గ్రేటర్‌ జిల్లాల వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌లో విషజ్వరాలు కేసులు నమోదవుతుండడంపై భయాందోళన వ్యక్తమవుతోంది.ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్‌ ఆస్పత్రులకు జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ రెట్టింపు అయింది. ఉస్మానియాలో ఓపీ 2వేల నుంచి 3వేలకు చేరుకుంది. గాంధీలో 3వేల నుంచి 5వేలకు.. ఫీవర్‌లో 1,200 నుంచి 2,500.. నిలోఫర్‌లో 1,500 నుంచి 2,500 చేరింది. సెలవు రోజుల్లో సైతం ఆయా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందిస్తున్నారు. మరోవైపు అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు దోమల నివారణ మందు స్ప్రే చేయాలని.. కాలనీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏరోజుకారోజు తొలగించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

ఎందుకీ పరిస్థితి?
2018 నవంబర్‌ మొదలు ఈ ఆగస్టు వరకు ఎన్నికల హడావుడి కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీహెచ్‌ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బందికీ ఎన్నికల విధులు అప్పగించారు. దీంతో ఆ సమయంలో బస్తీల్లో ఫాగింగ్, యాంటీలార్వా ఆపరేషన్‌ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు కాలనీల్లో కొత్త నిర్మాణాలు వెలిశాయి. సెల్లార్లు తవ్వడం, నిర్మాణాల క్యూరింగ్‌ కోసం నీటిని వాడడం, గదుల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, ట్యాంకులపై మూతలు లేకపోవడం వల్ల అవన్నీ డెంగీ దోమలకు నిలయంగా మారాయి. కనీసం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫాగింగ్‌ చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ దోమలువిస్తరించడంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి.  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో డెంగీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. రెండు రోజుల క్రితం మదీనాగూడకు చెందిన హేమంత్‌(10), అల్లాపూర్‌ డివిజన్‌ గాయిత్రినగర్‌కు చెందిన అభిషేక్‌(21), సికింద్రాబాద్‌కు చెందిన టిజాన్‌ ఎలిసా విన్‌స్టన్‌(13), నార్సింగి మున్సిపాలిటీలో పర్హీన్‌(15) మృతి చెందగా... బుధవారం లాలాపేటకు చెందిన రిత్విక(5) మరణించింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్‌ సహా నగరంలోని ఏ ఆస్పత్రిని పరిశీలించినా 40–50 మంది డెంగీ బాధితులే కనిపిస్తున్నారు. ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతుండడంతో ఇప్పటికే సెలవు రోజుల్లోనూ ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన వైద్యారోగ్యశాఖ తాజాగా వైద్య సిబ్బంది సెలవులపై ఆంక్షలు విధించింది. పరిస్థితి కుదుటపడే వరకు అనివార్యమైతే తప్ప.. సెలవులు మంజూరు చేయొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు డెంగీ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా జీహెచ్‌ఎంసీ సహా వైద్యారోగ్యశాఖను ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం హెచ్చార్సీలో బుధవారం ఫిర్యాదు చేసింది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకుపైగా డెంగీ పాజిటీవ్‌ కేసులు నమోదు కాగా... వారిలో ఇప్పటికే 50 మంది మృతి చెందారు.  

లెక్కల్లో తకరారు...
డెంగీ బాధితుల లెక్కలపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు 2,113 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైనట్లు చెబుతున్నా.. వాస్తవంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,889 మంది నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంలో పరీక్షించగా వీరిలో 451 మందికి డెంగీ పాజిటివ్‌ వచ్చింది. ఒక్క ఆగస్టులోనే 232 కేసులు నమోదయ్యాయి. ఇక ఉస్మానియాలో మే నుంచి ఇప్పటి వరకు 911 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 208 మందికి పాజిటివ్‌ వచ్చింది. నిలోఫర్‌ ఆస్పత్రిలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో 799 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... వీటిలో ఒక్క ఆగస్టులోనే 499 కేసులు నమోదు కావడం విశేషం.ఫీవర్‌ ఆస్పత్రిలో జులై, ఆగస్టులో 74 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 391 మంది హైదరాబాద్‌ జిల్లా వాసులు కాగా, మిగిలిన వారంతా రంగారెడ్డి, మల్కాజ్‌గిరి జిల్లాలకు చెందిన వారే. ఇక యశోద, కేర్, అపోలో, కిమ్స్, సన్‌షైన్, సిటిజన్, కామినేని, గ్లోబల్, తదితర ప్రైవేటు ఆస్పత్రులు డెంగీబాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ రోగులకు పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. డెంగీ బాధితుడి నుంచి రెండో శాంపిల్‌ సేకరించి ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉన్నప్పటికీ.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్‌ ఆస్పత్రి కూడా దీన్ని పాటించడం లేదు. దీంతో ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులనే డెంగీ కేసులుగా భావిస్తోంది.  

డెంగీకి కారణమిదే...
ఈడిన్‌ ఈజిఫ్టై (టైగర్‌ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాలు సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. – డాక్టర్‌ రాజన్న,చిన్నపిల్లల వైద్యుడు

అవసరం లేకపోయినా? 
ఆరోగ్యవంతుడి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగీ జ్వరంతో వీటి సంఖ్య క్రమేణా తగ్గుతుంటుంది. 10వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే తిరిగి వాటిని భర్తీ చేయాలి. 20వేల లోపు ఉన్నప్పుడు... రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే ఎక్కించాలి. 20వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అయినా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతో జరిగే అనర్థాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్లేట్‌లెట్ల సంఖ్యతో పాటు రక్తంలో ప్యాక్‌డ్‌ సెల్‌ వాల్యూమ్‌ (పీసీవీ) ఎంత ఉందనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంంగా ఉండాల్సిన దానికంటే 20శాతం, అంతకంటే ఎక్కువైతే అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా ఆస్పత్రులు అవసరం లేకపోయినా ప్లేట్‌లెట్స్‌ ఎక్కించి, రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పండ్లకు డిమాండ్‌..
డెంగీ బాధితుల్లో ప్లేట్‌లెట్స్‌ కౌంట్స్‌ పడిపోతుంటాయి. వైద్యులు ఇచ్చే మందులతో పాటు ప్రత్యామ్నాయంగా బొప్పాయి, కీవీ పండ్లు ప్లేట్‌లెట్స్‌ కౌంట్స్‌ను పెంచేందుకు దోహదపడుతుంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో సాధారణ జ్వరపీడితులే కాకుండా డెంగీ బాధితులు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు ఈ పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. నిన్న మొన్నటి వరకు ఒక కీవీ పండు రూ.15 ఉండగా, ప్రస్తుతం రూ.50 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో బొప్పాయి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60కి పైగా పలుకుతోంది. దోమల భారీ నుంచి రక్షించుకునేందుకు తెరలను కొనుగోలు చేస్తుండడంతో వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.200లోపు దొరికిన దోమ తెర... ప్రస్తుతం రూ.1500కి పైగా ధర పలుకుతోంది.  

ఇదీ పరిస్థితి
నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది.  సాధారణ రోజుల్లో ఓపీ సంఖ్య 1,000 వరకు ఉండగా... నాలుగైదు రోజుల నుంచి దాదాపు 2,000 దాటుతోందని సూపరిటెండెంట్‌ గంగాధర్‌ తెలిపారు.  
ఉప్పల్‌ ప్రాథమిక వైద్య కేంద్రంలో సాధారణ రోజుల్లో 100 వరకు ఉండే ఓపీ.. ప్రస్తుతం 200 దాటుతోందని డా.పల్లవి తెలిపారు. ఇక్కడ కనీసం ప్యారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం.  
మల్లాపూర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓపీ 100 నుంచి 200లకు పెరిగింది.  
ఏఎస్‌రావునగర్‌ జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రెండింతలైందని డాక్టర్‌ తేజస్వీని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో డెంగీతో ఇప్పటికే ముగ్గురు మరణించారు. మదీనాగూడకు చెందిన హేమంత్‌ (10), పాపిరెడ్డి కాలనీకి చెందిన అవినాష్‌ (13), మాదాపూర్‌ చందానాయక్‌ తండాకు చెందిన చందర్‌నాయక్‌ (38) డెంగీతో మృతి చెందారు.  
మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి, సరూర్‌నగర్, మీర్‌పేట్, మలక్‌పేట్‌లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు.  
సికింద్రాబాద్‌లోని ఐదు డివిజన్లలో
విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. లాలాపేట యాదవ బస్తీకి చెందిన చిన్నారి రుత్విక బుధవారం డెంగీతో మృతి చెందడం గమనార్హం.  
అంబర్‌పేట నియోజకవర్గంలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 50 నుంచి 250కి చేరింది.  
వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి జ్వరపీడితులు పోటెత్తుతున్నారు. సాధారణంగా రోజుకు సగటున 700–800 మంది అవుట్‌పేషెంట్స్‌ వస్తుండగా... ఇటీవల ఈ సంఖ్య 1300లకు చేరింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top