జైళ్ల డీజీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు: దాసోజు

Dasoju Sravan Comments On Prisons DG Vinay Kumar Singh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్‌ కుమార్‌ సింగ్‌ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. వినయ్‌ కుమార్‌ సింగ్‌కు ఎంత ధైర్యముంటే ఒక మీడియా సంస్థను కించపరుస్తూ ప్రకటన విడుదల చేస్తారంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా హౌస్‌ను సెక్స్‌ వర్కర్‌ అని అనటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా సంస్థను అనే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. యధా రాజా తథా అధికారి అన్నవిధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో వరంగల్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక రిపోర్టర్‌ని వంద అడుగుల లోతుకు పాతిపెడతా అన్నారని, ఈ రోజు జైళ్ల డీజీ మీడియా సంస్థను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘హెచ్‌ఎమ్‌టీవీ చేసిన తప్పేంటి?. చంచల్ గూడ జైల్ నుంచి పట్నాకు టేకును తరలించినందుకు స్టోరీ వేసింది. నువ్వు తప్పు చేయకుంటే హెచ్‌ఎమ్‌టీవీపై ఫిర్యాదు చెయ్యి.. లేదా ఇండియన్ జర్నలిస్టు యూనియన్‌కు, ప్రెస్ కౌన్సిల్ యూనియన్‌కు ఫిర్యాదు చెయ్యి, లేక కేసు పెట్టు. వినయ్ కుమార్ సింగ్ వ్యాఖ్యలు ఒక్క హెచ్‌ఎమ్‌టీవీపైనే  చేసిన వ్యాఖ్యలుగా మేము భావించటం లేదు. అన్ని మీడియా సంస్థలను వినయ్ కుమార్ సింగ్ తిట్టినట్లే మేము భావిస్తున్నాం. డీజీపీ మహేందర్ రెడ్డి వెంటనే వినయ్ కుమార్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి. వినయ్ కుమార్ సింగ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

‘ఎన్నికల సంఘానికి గులాబీ చీడ పట్టింది. రాష్ట్రంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగవని చెప్పడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సాక్ష్యం. మేము ఎంతగా మొత్తుకున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదు. పోలింగ్ బూత్, బ్యాలెట్ పేపర్లకు గులాబీ రంగు కావాలని ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల సంఘం ఇలా  చేయటం కంటే గులాబీ పార్టీకే ఓటు వేయమని చెబితే మేలు కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియాపై అణచివేత ధోరణిలో వ్యవహరిస్తోంది. ఎన్నికల సంఘం గులాబీ పార్టీకి గులాంగా పనిచేస్తోంద’ని శ్రావణ్‌ ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top