సైబర్‌ సెక్యూరిటీ అందరికీ అవసరమే 

Cyberabad Police Commissioner Sajjanar Tells About Importance Of Cyberabad Security - Sakshi

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాధానం అందిస్తున్నా సైబర్‌ నేరాలు తగ్గకపోవడంపై సైబరాబాద్‌ కమిషనర్‌ వి.కె.సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.సైబర్‌ సెక్యూరిటీ అంటే కేవలం ఐటీ సంస్థలకు చెందిన వ్యవహారమని అనుకోరాదని, స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించే వారికీ హ్యాకర్ల నుంచి ముప్పు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన మరింత పెంచుకోవాలని ఆయన ప్రజలకు గురువారం సూచించారు. హైదరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఓ సదస్సుకు హాజరైన వి.కె.సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ సైబర్‌ సెక్యూరిటీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఐదేళ్లుగా ‘సైబర్‌ సెక్యూరిటీ కాంక్లేవ్‌’ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వివిధ రాష్ట్రాల పోలీసులతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థల అధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారని చెప్పారు. అధికాదాయం గల వ్యక్తులనూ లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు నేరాలకు పాల్పడుతున్నారని సజ్జనార్‌ వివరించారు. ఫేస్‌బుక్‌ ద్వారా శత్రుదేశాల గూఢచారులు దేశీ రక్షణదళాల సిబ్బందిని వలలో వేసుకోవడమూ సైబర్‌ నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేసిన ఆయన ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతీసారి సంబంధిత శాఖకు అప్రమత్తంగా ఉండాల్సిందిగా లేఖలు రాస్తున్నామని వివరించారు.

విశాఖపట్నంలో ఇటీవల కొంతమంది నేవీ అధికారులను పాకిస్తాన్‌ గూఢచారులు హనీట్రాప్‌ చేసి సున్నితమైన సమాచారాన్ని రాబట్టిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌లో సుమారుగా ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. వీరిలో చాలామంది తమ ఉద్యో గాలు చేసుకుంటూనే ట్రాఫిక్‌ నియంత్రణ, మహిళల అంశాల విషయంలో పోలీసులకు సహకరిస్తున్నారని, సైబర్‌ సెక్యూరిటీ విషయంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ కాంక్లేవ్‌ సదస్సులో  కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ) ఉన్నతాధికారి సంజయ్‌ భాల్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top