పంటలపై పక్కా సర్వే

Crop Survey Continue In Medak District - Sakshi

జిల్లాలో కొనసాగుతున్న పంటల సర్వే

ఈ నెలాఖరులోగా 391 రెవెన్యూ గ్రామాల్లో  పూర్తి

రైతులు సాగు చేసే పంటల వివరాలన్నీ ఇక ఆన్‌లైన్‌లో ..

సాక్షి, పెద్దశంకరంపేట: ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన పంటలపై వ్యవసాయ అధికారులు పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ వివరాల సేకరణతో అటు రైతులకు అధికారులకు ఉపయోగకరంగా మారనుంది. రైతులు, పంటలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుండడంతో ప్రభుత్వ పథకాల అమలు ఇక సులభతరం కానుంది. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 83 వేల హెక్టార్లలో రైతులు ఆయా రకాల పంటలను సాగు చేసుకుంటున్నారు. జిల్లాలోని 391 రెవెన్యూ గ్రామాల పరిధిలో 2లక్షల 26 వేల మంది రైతులు పండించే పంటలను గ్రామాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి వివరాలు సేకరించి పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమం జిల్లాలో చురుకుగా కొనసాగుతుంది. జిల్లావ్యాప్తంగా ఏఓలు, ఏఈఓలు గ్రామాల వారిగా పర్యటించి రైతులు తమ సర్వే నంబర్లలో ఏఏ పంటలు సాగు చేస్తున్నారో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. 

ప్రతీ సర్వే నంబర్‌లో ఏ పంట సాగవుతుందో తెలుసుకోవడం సులభం
మెదక్‌ జిల్లా పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతులు సీజనల్‌ వారీగా ఆయా రకాల పంటలను సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వరిపంట, పత్తిపంట, మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, మినుములు, పెసర తదితర పంటలను విరివిగా సాగు చేస్తుంటారు. రైతులు తమ భూముల సారాన్ని బట్టి పంటల సాగును ఎంచుకుంటారు. ప్రస్తుతం వర్షాలు సక్రమంగా లేక పోవడంతో రైతులు వరిపంటను సాగు చేసే విషయంలో ఆలోచిస్తున్నారు. కొంత మేర బోరు బావుల వద్ద రైతులు వరిపంటను సాగు చేస్తున్నారు. దీని తర్వాత ఆరుతడి పంటలైన పత్తి, మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, పెసర పంటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు.

దీనిపై ప్రభుత్వం ఇటీవల జరిగిన సమావేశంలో ప్రతీ జిల్లాలో ఏఏ పంట ఎంత మేర సాగవుతుంది, రైతులకు కావలసిన మార్కెట్‌ విషయాలు, పండించిన పంటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరతో పాటు రైతుబంధు అమలు వంటిపై వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించింది. దీనికి అనుగుణంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ నెల 28 వరకు పంటల సాగు విషయాలను రైతుల నుంచి సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 40 శాతం వరకు గ్రామాల్లో సర్వే పూర్తయింది. మిగతా సర్వే ఈ నెలాఖరు వరకు పూర్తిచేయనున్నారు.

ఒక్కో ఏఈఓకు 3 వేల మంది రైతులు
మెదక్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలో 72 మంది ఏఈఓలు పనిచేస్తున్నారు.  ఆయా గ్రామాల వారీగా ఒక్కొక్క ఏఈఓ సుమారు 3 వేల మంది రైతుల వివరాలు సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. వీరు ఈ వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. గిట్టుబాటు ధర కావాలన్నా, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నా, రైతుల పంటలపై చేస్తున్న సర్వేనే ఇకపై ఆధారం కానుంది. దీని వల్ల కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు, దళారులకు చెక్‌ పడనుంది. రైతుబంధు పథకం ద్వారా కూడా ఇకపై రైతులకు ఇచ్చే నగదు దీని ఆధారంగానే వచ్చే అవకాశాలున్నాయి.

పంటలసర్వే కొనసాగుతోంది
జిల్లా వ్యాప్తంగా 391 రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రైతులు పండించే పంటల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 28 లోగా సర్వే పూర్తవుతుంది. పంటల వివరాల సర్వే ఆధారంగా మార్కెటింగ్‌ ఏర్పాటుతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎన్ని గ్రామాలకు ఏర్పాటు చేయాలనే విషయాలు తెలుస్తాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగానే వారి ఖాతాల్లో నగదు జమచేసే వీలుంటుంది. రైతులు వ్యవసాయ అధికారులకు సహకరించాలి. –పరశురాంనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, మెదక్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top