రైతు జేబు నింపేందుకే పంటకాలనీలు: పోచారం

Crop colonies for farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు జేబు నింపేందుకే పంట కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటులో భాగంగా పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ఇబ్రహీంపట్నం పంట కాలనీలోని 38 గ్రామాల రైతులతో సోమవారం ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రైతు జేబు, వినియోగదారుడి కడుపు నిండటానికే కాలనీల ఏర్పాటన్నారు. రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామన్నారు. కానీ రాష్ట్ర జనాభాకు అవసరమైన కూరగాయలలో 50 శాతం మాత్రమే స్థానికంగా పండుతున్నాయన్నారు.

రాష్ట్రంలోని 3.52 కోట్ల జనాభాకు 38.54 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరం కాగా 19.54 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన కూరగాయలు మన రైతులే పండించాలి, లాభాలు గడించాలి, వినియోగదారులకు తాజాగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌ నగరంలో కోటి మందికి పైగా నివసిస్తున్నారు. వీరందరికి తాజా కూరగాయలు అందించడానికి నగరం చుట్టూ పంట కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఇబ్రహీంపట్నంను ఎంచుకున్నామన్నారు. 

ప్రతి జిల్లా కేంద్రం, మున్సిపాలిటీల చుట్టూ 20 నుండి 30 కిలోమీటర్ల ప్రాంతాలలో పంట కాలనీలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైనంత మేర కూరగాయలను రైతులతో ఉత్పత్తి చేయిస్తామన్నారు.   ప్రతి మొక్క ఉత్పత్తికి 70 పైసల ఖర్చు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, ఇతరులకు 10 పైసలకే అందిస్తున్నామన్నారు.   వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడు తూ జనాభాలో మూడో వంతు హైదరాబాద్‌ నగరంలోనే నివసిస్తున్నారన్నారు. స్థానిక జనాభాకు అనుగుణంగా, అవసరమైన పంటలు పం డించాలన్నారు. ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top