హైకోర్టుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Court rejected the Anticipatory Bail petition of Konda Vishweshwar Reddy - Sakshi

ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు

ఎస్సైని నేను కొట్టలేదు..అతనే నా కాలర్‌ పట్టుకున్నాడు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారంటూ నమోదైన కేసులో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

పోలీసులే తనపట్ల దురుసుగా వ్యవహరించారని, దీనిపై తానే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిటిషన్‌లో ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసిన తరువాత అందుకు ప్రతీకారంగా గచ్చిబౌలి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, ఈ ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేశారన్నారు. తన కాలర్‌ పట్టుకొని దుర్భాషలాడిన పోలీసుపై మాత్రం కేసు నమోదు చేయని పోలీసులు... అతనిపై ఫిర్యాదు చేసినందుకు తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

కేసు వెనుక రాజకీయ కారణాలు...
కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందునే పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చానన్న కారణంతో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తనను ఇలా తప్పుడు కేసులో ఇరికించారని, సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్న తనకు చట్ట విరుద్ధమైన పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో సందీప్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద దొరికిన రూ. 10 లక్షలతో తనకు ఎటువంటి సంబంధం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ఫిర్యాదుదారైన పోలీసును తాను కొట్టలేదని/నిర్బంధించలేదని, ఎంపీగా ఉన్న తాను ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదన్నారు. అందువల్ల తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకవేళ అరెస్ట్‌ చేసినా వెంటనే బెయిల్‌ మంజూరు చేసేలా ఆదేశా లివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌ ముందు శుక్రవారం విచారణకు రాగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు బంధువని, అందువల్ల ఈ వ్యాజ్యంపై తాను విచారణ జరపడం భావ్యం కాదంటూ జస్టిస్‌ సంజయ్‌ తప్పుకున్నారు. ఈ కేసును మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top