వరి పెరిగె... పప్పులు తగ్గె.. | Country foodgrain production is above 28 crore tonnes | Sakshi
Sakshi News home page

వరి పెరిగె... పప్పులు తగ్గె..

Published Mon, Aug 26 2019 3:51 AM | Last Updated on Mon, Aug 26 2019 3:51 AM

Country foodgrain production is above 28 crore tonnes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి నాలుగో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం సీజన్‌లో ఏకంగా 28.49 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.64 కోట్ల టన్నులకు చేరింది. అంటే అదనంగా 54 లక్షల టన్నులు పెరిగింది. ఇక కీలకమైన పత్తి దిగుబడి పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేల్స్‌ ఉత్పత్తి కాగా, 2018–19లో కేవలం 2.87 కోట్ల బేళ్లకు పడిపోయింది.

ఏకంగా 52 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గిందన్నమాట. గులాబీ పురుగు కారణంగా దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి గణనీయంగా పడిపోయినట్లు కేంద్రం అంచనా వేసింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా కాస్త మందగించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.34 కోట్ల టన్నులకు పడిపోయింది. అంటే 5 లక్షల టన్నులు తగ్గింది. ఇక నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.22 కోట్ల టన్నులకు పెరగడం గమనార్హం. మొక్కజొన్న 2.72 కోట్ల టన్నులు, సోయాబీన్‌ 1.37 కోట్ల టన్నులు, వేరుశనగ 66 లక్షల టన్నులకు పెరిగింది. చెరుకు రికార్డు స్థాయిలో 40.01 కోట్ల టన్నులు ఉత్పత్తి కావడం విశేషం.

తెలంగాణ రాష్ట్రంలో మూడో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం 2018–19 సీజన్‌లో ఖరీఫ్, రబీ కలిపి ఆహార ధాన్యాల ఉత్పత్తి 91.93 లక్షల టన్నులుగా ఉంది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే 2018–19 సీజన్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2016–17లో 1.01 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండగా, 2017–18 సీజన్‌లో 96.20 లక్షలకు పడిపోయింది. ఈసారి ఇంకాస్త పడిపోవడం గమనార్హం. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014–15లో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 72.18 లక్షల టన్నులు మాత్రమే. ఆ తర్వాత 2015–16లో ఇంకా తగ్గి 51.45 లక్షల టన్నులకు పడిపోయింది. అయితే అప్పటినుంచి పెరుగుతూనే వస్తుంది. వర్షాలు, సీజన్లను బట్టి ఉత్పత్తి వత్యాసాలు ఉన్నా, పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement