ఈ నామ్‌.. గందరగోళం

Cotton farmers are worried by enam process in market - Sakshi

బస్తాల కోసం ముందుకు రాని వ్యాపారులు

నామ్‌కే వాస్తేగా ఆన్‌లైన్‌

రైతుల్లో మొదలైన వ్యతిరేఖత

జమ్మికుంట(హుజూరాబాద్‌) : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో మొదటి సారిగా పత్తి బస్తాలకు ఈ నామ్‌ పద్ధతిలో కొనుగోళ్లకు మంగళవారం అన్నిఏర్పాట్లు చేయగా మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ప్రధాన వ్యాపారులు ఎవరు ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ముందుకు రాలేదు. దీంతో బీ టైప్‌ వ్యాపారులు ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో పాల్గొన్నారు. పోటీ లేక రైతులకు కనీస ధర లభించలేదని రైతులు వాపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 200 వాహనాల్లో రైతులు లూజ్‌ పత్తిని మార్కెట్‌కు తీసుకురాగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు వాటికి వేలంపాటతో కొనుగోళ్లు జరిపారు. దీంతో గంట వ్యవధిలోనే లూజ్‌ పత్తి వాహనాలు మార్కెట్‌ యార్డు నుంచి వెళ్లిపోయాయి. బస్తాల్లో వచ్చిన పత్తికి మాత్రమే అధికారులు ఈ నామ్‌ పద్ధతి మొదలు పెట్టడంతో రైతులు మధ్యాహ్నం 1 గంటవరకు యార్డులో ఎదురు చూపులు తప్పలేదు. 

నామ్‌కు విరుద్ధంగా తూకాలు.. 
ఈ నామ్‌ పద్ధతిని అమలుకు శ్రీకారం చుట్టిన క్రమంలో మార్కెట్‌కు వచ్చిన పత్తి బస్తాలను ఆన్‌లైన్‌ కాకముందే యార్డులో అడ్తిదారులు కొందరు ధరలు నిర్ణయించి తూకాలు మొదలు పెట్టారు. దీంతో మార్కెట్‌ సూపర్‌వైజర్‌ గౌస్‌ తూకాలను నిలిపివేసి అడ్తిదారుల తీరుపై మండిపడ్డారు. నామ్‌ కొనుగోళ్లు ప్రారంభిస్తే ఎందుకు తుకాలు వేస్తున్నారని ప్రశ్నించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పొద్దంతా యార్డులో ఏలా ఉంటారని, లూజ్‌ పత్తి తీసుకువచ్చిన రైతులు అమ్మకాలు పూర్తిచేసుకుని మార్కెట్‌ బయటకు వెళ్తుంటే బస్తాల రైతులు ఏం పాపం చేశారని అడ్తిదారులు ప్రశ్నించారు. ఒక్క, బస్తా, రెండు బస్తాలు తీసుకు వచ్చిన రైతులు అన్‌లైన్‌ కోసం గంటల కొద్ది ఎదురు చూస్తారా అంటూ సూపర్‌వైజర్‌ను నిలదీశారు. దీంతో అడ్తిదారులు తూకాలను నిలిపివేసి ఈ నామ్‌ వరకు ఎదురు చూడక తప్పలేదు. 

ముందుకు రాని వ్యాపారులు..
మార్కెట్‌లో ఈ నామ్‌ అమల్లోకి రావడం...అందులో కేవలం బస్తాలకే అమలు చేయడంతో ప్రధాన వ్యాపారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో బీ టైపు వ్యాపారులు ఇష్టానుసరంగా రైతులు తీసుకువచ్చిన బస్తాల పత్తికి ఆన్‌లైన్‌లో ధరలు నిర్ణయించారు.  క్వింటాల్‌కు రూ.4,170 పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 96 క్వింటాళ్ల పత్తిని బస్తాల్లో తీసుకరాగా బీ టైప్‌ వ్యాపారులు ఆన్‌లైన్‌ క్వింటాల్‌ పత్తికి గరిష్ట ధర రూ. 4,170 నిర్ణయించారు. మోడల్‌ ధర రూ. 3,900, కనిష్ట ధర రూ. 3,500 చెల్లించారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top