గుడిసెవాసులపై కార్పొరేటర్‌ దాడి  

Corporator Attack On Poor People - Sakshi

కత్తులు, కర్రలతో బీభత్సం

గాయపడిన గుడిసెవాసులు

మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు

కరీమాబాద్‌ వరంగల్‌ : మైసమ్మ బోనాలకు తనను పిలువలేదనే కోపంతో ఓ కార్పొరేటర్‌ అనుచరులతో వచ్చి గుడిసెవాసులపై దాడి చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు బత్తిని సతీష్, నర్సింహా, వెంకటేష్, మార్కం డేయ, వనజ, పద్మ, ధనలక్ష్మి, రాణి, మోడీ, సంజు, నాగరాజుతోపాటు పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని 23వ డివిజన్‌ నున్నా నారాయణ నగర్‌లో కాలనీవాసులు మైసమ్మ బోనాలు చేసుకున్నారు.

బోనాల పండుగకు తనను పిలువలేదనే కోపంతో అర్ధరాత్రి కార్పొరేటర్‌ కత్తెరశాల వేణుగోపాల్, అనుచరులు 20 మంది కత్తులు, కర్రలు పట్టుకుని వచ్చి మహిళలను దూషించారు. దాడికి పాల్పడి గాయపరిచారు. వీధిలైట్లు బంద్‌ చేయించి, మద్యం తెప్పించుకుని తాగుతూ నానా బీభత్సం సృష్టించారని కాలనీలవాసులు తెలిపారు. ఇందులో కత్తి వెంకటేష్, నాగరాజు, మార్కండేయులు తీవ్రంగా గాయపడినట్లు వివరించారు.

100 డయల్‌ చేయగా పోలీసులు వచ్చి తమను కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా తమపై దాడి చేసి, మహిళలను దూషించిన, గాయపరిచిన కార్పొరేటర్‌ కత్తెరశాల వేణుగోపాల్, అతడి అనుచరులపై మిల్స్‌కాలనీ సీఐ నందిరామ్‌కు కాలనీవాసులు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ బాధిత కాలనీ వాసులు, కార్పొరేటర్‌ ఇరువర్గాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top