పది రోజులు ప్రజా రవాణా బంద్‌..

Coronavirus : Public Transport Has Stopped For Ten Days - Sakshi

అధికారికంగా స్తంభింపజేసిన ప్రభుత్వాలు

దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న 13 వేల రైళ్లు 

రాష్ట్రంలో ఎక్కడికక్కడే ఆగిన 9,600 బస్సులు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారి ప్రజా రవాణా వ్యవస్థ అధికారికంగా స్తంభించింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 రోజులు ప్రజా రవాణాకు బ్రేక్‌ పడింది. ఇటు రైళ్లు, అటు బస్సులు.. ఇన్ని రోజులపాటు ప్రజలకు అందుబాటులో లేకపోవటం ఇదే తొలిసారి. రైల్వే వ్యవస్థ ప్రారంభమైన ఈ 174 ఏళ్లలో, రాష్ట్రంలో బస్సు రవాణా మొదలైన 8 దశాబ్దాల్లో పాలక వ్యవస్థనే స్తంభింపచేయటం తొలిసారి చోటు చేసుకుంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం రైళ్లు, బస్సులు నిలిచిపోగా, దాన్ని కొనసాగిస్తూ ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ చేయటంతో వచ్చే 9 రోజులు కూడా రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండవు.

సాధారణంగా సమ్మెలు, హర్తాళ్‌లు, బంద్‌ల సమయంలో వీటిని నిలిపేయటం సహజం. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగొద్దన్న ముందు జాగ్రత్త చర్యలతో అధికారులు వాటిని పాక్షికంగా నిలిపేస్తారు. ఇక సమ్మెల సమయంలో ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరిస్తే వాటిని నడిపే అవకాశం లేక నిలిపేస్తారు. కానీ ప్రభుత్వమే నిలిపేయటం, అది పది రోజులపాటు కొనసాగటం తొలిసారి. దేశ చరిత్రలో మహమ్మారులు ప్రబలటం గతంలోనూ చోటు చేసుకుంది. కానీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ప్రజా రవాణా వల్ల ఆ వ్యాధులు ప్రబలుతున్నాయన్న కారణంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు చరిత్రలో లేవు. (కరోనాకు మరో ముగ్గురి బలి)

నిపుణుల హెచ్చరికలతో.. 
రైళ్లలో వేల మంది ప్రయాణికులు అతి సమీపంలో ఉంటూ ప్రయాణించటం పెను విపత్తుకు కారణమవుతుందంటూ గత వారం రోజులుగా నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ వైరస్‌ ప్రభావం తీవ్ర రూపం దాల్చటంతో మన దేశంలో కూడా ప్రమాద ఘంటికలు మోగాయి. ఇతర కొన్ని ప్రభావిత దేశాలతో పోలిస్తే మన దేశం కొంత సురక్షితంగానే అనిపించటంతో, ప్రమాదం పెరిగే లోపు మేల్కొనటం ఉత్తమమని నిపుణులు కేంద్రం దృష్టికి తెచ్చారు. రైళ్లను నిలిపేస్తే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జన ప్రవాహం బాగా తగ్గి వైరస్‌ విస్తరించే అవకాశం అంతమేర తగ్గిపోతుందని వారు పేర్కొంటూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు రైల్వే అధికారులు కూడా రైల్వే బోర్డు, రైల్వే శాఖ మంత్రి దృష్టికి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (జయహో జనతా..)

కానీ ఒకేసారి రైళ్లను ఆపితే ప్రజా రవాణా స్తంభించి తీవ్ర ఇబ్బందులు వస్తాయని కేంద్రం తటపటాయించింది. కానీ గత నాలుగు రోజులుగా సంభవిస్తున్న పరిణామాలు కేంద్రాన్ని ఆలోచించేలా చేశాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటిలో స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉన్నప్పటికీ, విచ్చలవిడిగా ప్రయాణాలు చేస్తుండటం, నిత్యం రైళ్లలో అలాంటి వారిని తోటి ప్రయాణికులు గుర్తించి ఫిర్యాదు చేయటంలాంటివి దీనికి కారణం. పరిస్థితి ఇలాగే ఉంటే చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు వరస సమావేశాలు నిర్వహించిన రైల్వే శాఖ చివరకు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన పచ్చజెండా ఊపారు. ఇటు  హైదరాబాద్‌లో ఉన్న 121 ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా 31 వరకు నిలిపేయాలని నిర్ణయించారు.  

అన్ని బస్సులూ బంద్‌ 
అన్ని రైళ్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే రాష్ట్రం పరిధిలో ఆర్టీసీ బస్సులన్నింటిని నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే సమ్మె సమయంలో 52 రోజుల పాటు బస్సులు స్తంభించినా, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలతో కొన్నింటిని నడిపింది. ఇప్పుడు ఏకంగా 10 రోజులు పాటు వాటికి పూర్తి విరామం ఇచ్చింది. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం బస్సులన్నింటినీ డిపోలకే పరిమితం చేయగా, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ నెలాఖరు వరకు డిపోలకే పరిమితం చేయనున్నారు.  

రైల్వే సర్వీస్‌ :
దేశ వ్యాప్తంగా : 13వేల రైళ్లు
ద.మ.రై. పరిధిలో : 744 రైళ్లు
రోజువారీ ప్రయాణికులు : 2.5 కోట్లు

టీఎస్‌ఆర్టీసీ : 
మొత్తం బస్సులు : 9,600
రోజువారీ ప్రయాణికులు : 87 లక్షలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top