టెన్త్‌ పరీక్షలు వాయిదా

High Court Orders Telangana Government To Postpone SSC Exams - Sakshi

హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు నిలిపివేత

నేడు జరిగే పరీక్ష మాత్రం యథాతథం  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10వ తరగతికి సంబంధించిన పలు పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రప్పించడం సరికాదని, పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించడంతో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే శనివారం జరిగే పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టు చెప్పనందున ఆ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహించనుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా పడిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు.

ఏప్రిల్‌ 6లోగా నిర్వహించడాన్ని పరిశీలించండి: హైకోర్టు
రాష్ట్రంపై కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ 10వ తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు అంతకుముందు విచారణ చేపట్టింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరీక్షలను రీ షెడ్యూల్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 6లోగా పరీక్షలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది. ఒకవేళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ఆ తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తుందని ఆశిస్తున్నామని హైకోర్టు తెలిపింది. పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలన్నది అధికారుల విచక్షణాధికారమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుందని, విద్యార్థుల మధ్య మీటరు దూరం ఉండేలా ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనల సందర్భంగా హైకోర్టుకు వివరించారు. (కరోనా ఎఫెక్ట్‌ : సిలికాన్‌ వ్యాలీ షట్‌డౌన్‌)

పరిణామాలను ఊహించడమే కష్టంగా ఉంది...
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇరాన్, ఇటలీల్లో కరోనా ఏ స్థాయిలో ప్రబలిందో అందరం చూస్తున్నాం. రాష్ట్రంలో వైరస్‌ కట్టడికి ప్రభుత్వం కూడా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటోంది. యుద్ధప్రాతిపదికన స్పందిస్తోంది. కరీంనగర్‌లో 7 కరోనా కేసులు బయటపడ్డాయి. ఎవరైనా విద్యార్థి వైరస్‌ బారినపడి, ఆ తల్లిదండ్రులకు ఆ విద్యార్థి ఒక్కరే బిడ్డ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకే గదిలో 30 మంది విద్యార్థులు 2–3 గంటలపాటు ఉంటున్నప్పుడు జరగరానిది జరిగితే అందుకు బాధ్యత ఎవరిది? ఈ పరిణామాలను ఉహించడమే కష్టంగా ఉంది. విద్యార్థులు పరీక్షలు రాసి ఇళ్లకు వెళ్లాక కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? పరీక్ష సందర్భంగా కేంద్రాల్లో ఉపాధ్యాయుల సంగతి ఏమిటి? పరీక్ష చాలా ముఖ్యమైనదే. కాని ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ జాగ్రత్త చర్యలు అంతకన్నా ముఖ్యమైనవి. ఇదే విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రప్పించడం సరైన నిర్ణయం కాదు’అని ధర్మాసనం స్పష్టం చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top