మరో ఐదుగురి రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది : గంగుల

Coronavirus : Gangula Kamalakar On Sanitization Works In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జిల్లా ప్రజలంతా ఏప్రిల్‌ 15 వరకు ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. నగరం ఆరోగ్యంగా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన యాంటీ బ్యాక్టీరియల్‌ క్యాబిన్‌ను మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత ప్రచారం కోసం ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చినవారికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు కరీంనగర్‌లో 15, హుజురాబాద్‌లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. మరో ఐదుగురి రిపోర్ట్స్‌ రావాల్సి ఉందన్నారు. 

జిల్లాలో దాదాపు 700 మంది క్వారంటైన్‌లో ఉన్నారని మంత్రి వెల్లడించారు. పగడ్బందీ చర్యలతో కరీంనగర్‌ సేఫ్‌ జోన్‌గా ఉందని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు శుభ్రపరచడానికి యాంటీ బ్యాక్టీరియల్‌ క్యాబిన్‌ ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని పరికరాలు తెప్పిస్తామని అన్నారు. కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. 

కేటాయించిన సమయంలోనే రైతులు ధాన్యం తీసుకురావాలి..
అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 39 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని చెప్పారు. దాదాపు 99 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రభుత్వపరంగా 75 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 6,695  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎక్కడైనా రెండు సెంటర్‌లు కావాలంటే కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కేటాయించిన సమయంలోనే రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top