క‘రోనా’ పార్టీ

CoronaVirus: Birthday Party At Himayat Nagar Adds 20 New Cases - Sakshi

హిమాయత్‌నగర్‌లో వజ్రాల వ్యాపారి పుట్టిన రోజు వేడుకలు

ఆహ్వానితుడు సహా మరో వ్యాపారి మృతి.. 20 మందికి పాజిటివ్‌ 

మారుపేర్లతో గుట్టుగా పరీక్షలు చేయించుకుంటున్న ప్రముఖులు 

సాక్షి, హైదరాబాద్ ‌: వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా, దీనికి హాజరైన 28 మంది వైరస్‌ బారినపడ్డారు. అదే కుటుంబంలోని తండ్రి, కొడుకు మృతి చెందారు. మలక్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మే నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీనికి హాజరైన పిల్లల ద్వారా అదే అపార్ట్‌మెంట్‌లోని 52 మందికి వైరస్‌ సోకింది. పçహాడీషరీప్‌కి చెందిన మటన్‌ వ్యాపారి భార్య తరపు బంధువులంతా మే మూడో వారంలో ఒకేచోట చేరారు. మూడు నాలుగు రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండి, సామూహిక భోజనాలు, ఆటపాటలతో గడిపారు. ఈ ఘటనలో 30 మందికి కరోనా సోకింది.

ఇంత జరుగుతున్నా కొందరు మారడం లేదు. ఆరోగ్యంపై అంతో ఇంతో అవగాహన ఉన్న వారు కూడా వేడుకల పేరుతో విందు వినోదాల్లో మునిగితేలుతున్నారు. తద్వారా పలువురికి వైరస్‌ సోకడంతో పాటు మరణాలూ చోటుచేసుకుంటున్నాయి. అందుకు ఈ తాజా ఉదంతమే నిదర్శనం. నగరంలోని ప్రముఖ బంగారు, వజ్రాల వ్యాపారి కుటుంబం హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నంబర్‌–5లో నివసిస్తోంది. వ్యాపారి 63వ పుట్టిన రోజు వేడుకలను జూన్‌ 22న కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇద్దరు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జువెలరీ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖులు.. దాదాపు 150 మంది వరకు హాజరయ్యారు.

వీరంతా సామూహిక విందులో పాల్గొన్నారు. అనంతరం రెండ్రోజులకే వ్యాపారి దగ్గు, ఆయాసంతో బాధపడుతూ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. తాత్కాలికంగా మందులు రాసి, ఎందుకైనా మంచిదని, కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు. మందులు వేసుకున్నా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరగా, ఆ మర్నాడే మృతి చెందారు. ఈ వేడుకలకు హాజరైన జువెలరీ అసోసియేషన్‌ ప్రతినిధి కూడా కరోనా బారినపడి ఐదు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆ తర్వాత వేడుకలకు హాజరైన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో ఈ పార్టీకి హాజరైన ఇతర ప్రముఖులంతా హడలెత్తుతున్నారు. వైద్యుల ట్రేసింగ్‌కు చిక్కకుండా.. వీరంతా మారుపేర్లతో పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top