‘ప్లాస్మా’తో కోలుకుంటున్నకరోనా బాధితుడు

Corona Patient Recovered For Plasma - Sakshi

ఒకే బాధితునికి రెండుసార్లు ఎక్కించిన వైనం

రెండు రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి్జ!

గాంధీ ఆస్పత్రి: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ సత్ఫలితాలిస్తోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితునికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించడంతో కోలుకుంటున్నాడు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదేశాలతో దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను గాంధీ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో మైనస్‌ 18 డిగ్రీల సెల్సియస్‌ ఫ్రీజర్‌ బాక్సుల్లో భద్రపరిచారు. సుమారు 16 మంది కరోనా బాధితులు ఆక్సిజన్‌పై ఉండగా వారిలో ఆరుగురిని ప్లాస్మా థెరపీ కోసం ఎంపిక చేసి ఐసీఎంఆర్‌కు పంపారు. అక్కడి ఆదేశాలతో ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. పాతబస్తీకి చెంది న 44 ఏళ్ల బాధితునికి ఈనెల 14న 200 ఎంఎల్‌ ప్లాస్మాను ఎక్కించారు.

బాధితుడు కోలుకోవడంతో ఈనెల 16న రెండో డోస్‌గా మరో 200 ఎంఎల్‌ ప్లాస్మాను ఎక్కించారు. ఐసీఎంఆర్‌ నిబంధన ప్రకారం.. ప్లాస్మా ఎక్కించిన తర్వాత బాధితుడు కోలుకుంటున్న క్రమంలో రెండో డోస్‌ ఎక్కించాలి. మొదటిడోస్‌ ప్లాస్మా ఎక్కించినా æ పురోగతి లేకుంటే ఈ రకమైన చికిత్స ఎటువంటి ప్రభావం చూపట్లేదని భావించి రెండో డోస్‌ ఇవ్వరు. ఈ నేపథ్యంలో బాధితుడు కోలుకుంటున్న క్రమంలోనే రెండో డోస్‌ ప్లాస్మా ఎక్కించినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో సదరు బాధితుడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా బాధితులకు సరిపడే ప్లాస్మా అందుబాటులో ఉంది. ఐసీఎంఆర్‌ ఆదేశాలతో మిగిలిన వారికీ సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ ప్రారంభించే అవకాశం ఉందని ఓ వైద్యుడు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు దాతల నుంచి ప్లాస్మా సేకరించామని ఆస్పత్రి పాలన యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top