ఆస్పత్రి నుంచి తప్పించుకుని.. 

Corona Patient Flew Away From King Koti Hospital To Native Place - Sakshi

 హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చిన కరోనా రోగి 

సోదరుడు ఇచ్చిన సమాచారంతో తిరిగి ఆస్పత్రికి తరలించిన అధికారులు

సాక్షి, తొర్రూరు : కరోనా వైరస్‌ బారిన పడి హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తప్పించుకుని వచ్చాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేసేవాడు. అక్కడ ఆయనకు వైరస్‌ సోకగా.. ఈనెల 15న కింగ్‌ కోఠి ఆస్పత్రిలో చేరాడు. అయితే, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ నుంచి ఆర్టీసీ బస్సులో సూర్యాపేట వరకు, మరో బస్సులో తొర్రూరుకు చేరుకున్నాడు.

కాగా, హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి బయలుదేరే సమయంలో తన సోదరుడికి ఫోన్‌ చేసి విషయం తెలుపగా.. అతను వెంటనే వైద్య, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కోట చలం, ఎస్సై నగేష్, సిబ్బందితో కలసి తొర్రూరు బస్టాండ్‌లో కరోనా సోకిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పీపీఈ కిట్‌ తొడిగాక అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి కోవిడ్‌ వార్డుకు తరలించారు. తర్వాత అతను ఏ బస్సులో ఎక్కాడు, అందులో ఎందరు ప్రయాణించారనే అంశాలపై విచారణ చేపట్టారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top