తెలంగాణలో కరోనా కల్లోలం.. | Corona Death Toll Rises To Six In Telangana | Sakshi
Sakshi News home page

ఆరుకు చేరిన మరణాలు..

Mar 31 2020 2:32 AM | Updated on Mar 31 2020 4:58 AM

Corona Death Toll Rises To Six In Telangana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా  కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆరుగురిని బలితీసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు 76కు చేరాయి. ‘ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. అందులో తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, అపోలో, గ్లోబల్‌ ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. వీరి ద్వారా కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు.

మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది కాబట్టి, ఆ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్‌ వెళ్లొచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలని కోరింది. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ కోరుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. కాగా, ఒక్కరోజే ఆరుగురు చనిపోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఢిల్లీ ప్రార్థనల్లో ఎంత మంది పాల్గొన్నారు? వారెక్కడెక్కడ ఉన్నారు? వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

76కు చేరిన కేసులు.. 13 మంది డిశ్చార్జి
కరోనా కేసులు భీతిగొల్పుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఆరు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 76కి చేరింది. అందులో 13 మందిని సోమవారం డిశ్చార్జ్‌ చేయగా, మరో బాధితుడు ఇది వరకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అంటే మొత్తం 14 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఈ మేరకుతెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. డిశ్చార్జి అయినవారు, చనిపోయిన వారిని తీసేస్తే, మిగిలినవారు కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జి అయిన 13 మందిలో ఇండోనేషియాకు చెందిన 9 మంది, వారితో వచ్చిన ఢిల్లీ, యూపీకి చెందిన ఇద్దరున్నారు. వారితోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన యువతి, నగరానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం పాజిటివ్‌ వచ్చిన ఏడుగురి వివరాలను వెల్లడించకుండా దాచిపెట్టిందన్న విమర్శలున్నాయి. సీఎం కార్యాలయం స్పష్టంగా ప్రకటించినా, వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉండిపోయింది.

చిన్నారికి కరోనా పాజిటివ్‌..
నాలుగు రోజుల క్రితం నిలోఫర్‌ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేరిన శిశువు (18 నెలలు)కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో చిన్నారిని ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతనికి లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారా వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. శిశువుకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో తల్లిదండ్రులతో పాటు డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, పీజీలు, స్టాఫ్‌ నర్సు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పీజీలు ప్రస్తుతం జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ శిశువుకు చికిత్స చేసిన ఈఎస్‌ఆర్‌లోనే మరో 20 మంది పిల్లలు, వారికి సహాయంగా వచ్చిన తల్లిదండ్రులు ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఈ ఘటనతో ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులతో పాటు విదేశాల నుంచి వచ్చిన ఆరేళ్ల బాలునికి కరోనా పాజిటివ్‌గా ఇప్పటికే నిర్ధారణైన విషయం తెలిసిందే. తాజాగా నాంపల్లికి చెందిన చిన్నారి కూడా కరోనా బారిన పడటంతో ఈ వ్యాధిబారిన పడిన పిల్లల సంఖ్య రెండుకు చేరింది. నిమోనియా, జ్వరంతో బాధపడుతూ ఈ బాలుడు నిలోఫర్‌ చేరగా, కరోనాగా తేలింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement