తెలంగాణలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
* టీడీపీ నేతలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
* రంగారెడ్డి టీడీపీకిస్తే కాంగ్రెస్‌కు రెండు జిల్లాల్లో మద్దతు
* టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను ఒప్పించే బాధ్యత ఎర్రబెల్లికి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 5న జరగనున్న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్‌తో స్నేహం చేయాలని దాదాపుగా నిర్ణయించారు. పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కీలకంగా మారిన మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయా జిల్లాల నేతలతో సమావేశమయ్యారు.
ఈ మూడు జిల్లాల్లో టీడీపీ కీలకమైన దృష్ట్యా రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో తమకు మద్దతిస్త్తే, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు ప్రాథమికంగా తేల్చారు. ఇదే తరహాలో వైస్ చైర్మన్‌లను కూడా కాంగ్రెస్, టీడీపీ పంచుకోవచ్చని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ పొన్నాలకు జిల్లా జెడ్‌పీ పీఠం ప్రతిష్టాత్మకమైన దృష్ట్యా రంగారెడ్డి జిల్లాలో టీడీపీకి మద్దతిచ్చేలా ఒప్పించే బాధ్యతను ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించినట్లు సమాచారం.