అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ

Congress Party Candidate Medipalli Satyam Election Campaign - Sakshi

కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం   

సాక్షి, గంగాధర: తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు చొప్పదండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. చొప్పదండి మండల కేంద్రంతో పాటు రుక్మాపూర్, కొలిమికుంట, భూపాలపట్నం, వెదురుగట్ట, చాకుంట గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామాకాల కోసం సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా కుటుంబపాలనకే పరిమితమైందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నాలుగున్నర సంవత్సరాలుగా చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి రైతులు, ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తినన్నారు. ఈసారి అవకాశం ఇస్తే చొప్పదండి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపుతానని, అసంపూర్తి కాలువ నిర్మాణం పనులు పూర్తి చేస్తానన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మొదలైన ప్రాజక్టులకు రిడిజైన్‌ పేరుతో అంచనా వ్యయంతో పెంచి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు, ఒక ఇంట్లో ఎందరు అర్హులుంటే వారందరికీ పింఛన్‌ మంజూరు చేస్తోందని తెలిపారు. అంతేగాక పింఛను పెంచుతామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వారికి అదనంగా రెండు లక్షలు, ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 50వేల నగదును, ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూసి నాలుగైదు రాష్ట్రాల బడ్జెట్‌ కావాలని విమర్శించిన టీఆర్‌ఎస్‌ అదే మేనిఫెస్టోను కాపీ కొట్టిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మండల కాంగ్రెస్‌ నాయకులతో పాటు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top