కాంగ్రెస్‌ అభ్యర్థుల వెల్లడి మరికాస్త ఆలస్యం

Congress MLA Candidate List Pending Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల మరికాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి పలు వాయిదాల అనంతరం పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ ముఖ్యులు వెల్లడించారు. అందులో భాగంగా ఎలాంటి వివాదం లేని స్థానాల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ తరఫున దాదాపు 10 స్థానాలకు పోటీ చేసే నేతల పేర్లను అధిష్టానం ఆమోదించింది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ టీపీసీసీ ముఖ్యనేతలు మేనిఫేస్టో రూపకల్పనలో భాగంగా దుబాయి పర్యటనకు వెళ్లారు. దీంతో అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించే అవకాశం అనుమానమేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే వారి విషయమై ఏకాభిప్రాయం కోసం పరిశీలన సాగుతోంది. ఇంకా కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించి ఒకేసారి నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే 12వ తేదీనే మొత్తం అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.

టీడీపీకి మాత్రమే స్థానం 
కాంగ్రెస్‌ నేతృత్వంలో రూపం సంతరించుకున్న మహాకూటమి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగస్వామ్య పక్షాలకు స్థానం దక్కడం లేదని తెలుస్తోంది. కేవలం కూటమిలోని టీడీపీకి మాత్రమే రెండు స్థానాలు మాత్రమే కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క స్థానం కోసం తీవ్రంగా పట్టుబడుతోంది. స్థానం దక్కించుకోవడానికి ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానంతో సంప్రదింపులు సైతం చేస్తోంది. అయితే టీజేఎస్‌ కోరుతున్న మహబూబ్‌నగర్‌ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించినట్లు తెలుస్తోంది.

అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా టీడీపీ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెడుతుండడంతో... టీజీఎస్‌కు సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. టీజేఎస్‌ తరఫున బరిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీకి కూడా అవకాశం దక్కడం లేదని తెలుస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్‌ స్థానం కోసం పట్టుబడుతున్నారు. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా సర్దుబాటు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top