మూడు గెలిచినా జోష్‌ లేదు!

Congress leaders were dissatisfied with fewer seats than the BJP - Sakshi

బీజేపీకన్నా తక్కువ సీట్లు రావడంపై కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి

జహీరాబాద్, చేవెళ్లలో ఇంకొంచెం కష్టపడి ఉండాల్సిందని అభిప్రాయం

ఫలితాల సమీక్ష సమావేశం వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఫలితాలు కొంత సానుకూలంగా వచ్చాయనే భావన తప్ప, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో పెద్దగా జోష్‌ కనిపించడం లేదు. బీజేపీకన్నా తక్కువ సంఖ్యలో స్థానాలు వచ్చాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌లో, బీజేపీకి తమకన్నా ఎక్కువ స్థానాలు రావడం అసంతృప్తికి కారణమవుతోంది. మూడు స్థానాల్లో గెలిచినంతవరకు బాగానే ఉంది కానీ, మరింత సానుకూల ఫలితాలు వచ్చి ఉంటే పార్టీ శ్రేణులకు మరింత స్థైర్యం వచ్చేదని, బీజేపీకన్నా ఒక్క స్థానంలో ఎక్కువ గెలిచినా సేఫ్‌జోన్‌లో ఉండేవారమనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.  

నిస్తేజం నుంచి కోలుకునిఉంటే..
వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి తోడు పార్టీ నేతలంతా వలసల బాట పడుతున్న పరిస్థితుల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కొంత కోలుకుని పనిచేసి ఉంటే బావుండేదని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. అప్పటికే కార్యకర్తలు ఆత్మన్యూనత భావనతో ఉండడం, కీలక నేతలంతా బరిలోకి దిగి ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పార్టీపరంగా ఫోకస్‌ చేయలేకపోయామని వారు అంగీకరిస్తున్నారు.

జహీరాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమికి ఇదే కారణమని, ఇంకొంచెం కష్టపడి ఉంటే ఖచ్చితంగా మరో రెండు స్థానాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు రేవంత్, కోమటిరెడ్డి లాంటి నేతలు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారంలో ఉన్నా మిగిలిన కాంగ్రెస్‌ నేతలంతా కలసికట్టుగా ప్రచారం నిర్వహించి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రణాళికతో ప్రచారం చేసి ఉంటే రెండు, మూడు స్థానాల్లో సానుకూల ఫలితం వచ్చేదని, అప్పుడు బీజేపీ తమకు ప్రత్యామ్నాయమనే చర్చ కూడా వచ్చేది కాదని వారంటున్నారు.  

సమావేశమన్నారు.. వాయిదా వేశారు..
లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకుగాను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్‌ నేతలు దాన్ని ఆకస్మికంగా వాయిదా వేసుకున్నారు. సమావేశానికి హాజరయ్యేందుకు శనివారం కొందరు నేతలు గాంధీభవన్‌కు చేరుకున్న తర్వాత వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ రేవంత్, కోమటిరెడ్డిలు అభినందనల కార్యక్రమంలో బిజీగా ఉండడంతో సమీక్ష సమావేశానికి రాలేకపోతున్నామని తెలియజేశారు. దీంతో సమావేశంలో భాగంగా గెలిచిన ముగ్గురు ఎంపీలకు సన్మానం ఏర్పాట్లు చేసినా వారు రాకపోవడంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ నేతృత్వంలో కేక్‌కట్‌ చేసి సంతృప్తి చెందారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. ఆయన ఆదివారం మళ్లీ హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top