
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 10న (బుధవారం) కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రజలు, మేధావులు, నిపుణులతో చర్చించనున్నట్లు సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సోమవారం వెల్లడించారు. ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్న పంజాబ్ మంత్రి మన్‌ప్రీత్ బాదల్, రజనీపాటిల్‌లు సమావేశానికి హాజరవుతారని ఆయన తెలిపారు. 10న ఉదయం 10:30 గంటలకు ఇందిరా భవన్‌లో జరిగే ఈ సమావేశానికి వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంఘాలు, ప్రతినిధులు హాజరై తమ సూచనలు తెలియజేయవచ్చని వెల్లడించారు.