సీబీసీఎస్‌ అమలులో గందరగోళం 

Confusion in implementation of CBCS - Sakshi

ఇంకా కొనసాగుతున్న డిగ్రీ వార్షిక పరీక్షలు

మరోవైపు కొత్త విద్యా సంవత్సరం తరగతులు  

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీలో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) నిర్వహించడంలో వైస్‌ చాన్స్‌లర్లు అనుసరిస్తున్న ఇష్టారాజ్య విధానాలు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఫలితంగా కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ వార్షిక పరీక్షలు కొనసాగుతుండగా మరికొన్ని యూనివర్సిటీల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు చర్యలు మొదలు పెట్టాయి. కొన్ని యూనివర్సిటీలు అయితే ఇటు పరీక్షలు నిర్వహిస్తూనే.. అటు కొత్త విద్యా సంవత్సర తరగతుల ప్రారంభానికి ప్రకటనలు చేస్తుండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. గత విద్యా సంవత్సరంలో సీబీసీఎస్‌ అమలులో వైఫల్యం కారణంగానే డిగ్రీ పరీక్షలు మే నెలలో మొదలై ఇప్పటికీ పూర్తి కాకుండా జూలై వరకు కొనసాగించే పరిస్థితి నెలకొంది.

ఉస్మానియాలో జూలై 8వ తేదీ వరకు, కాకతీయలో జూలై 2 వరకు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో జూలై 6 వరకు, పాలమూరు వర్సిటీలో జూన్‌ 29 వరకు, శాతవాహన వర్సిటీలో జూన్‌ 24 వరకు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జూన్‌ 22వ తేదీ వరకు 2018–19 విద్యా సంవత్సర డిగ్రీ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాకుండానే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు శాతవాహన, కాకతీయ, ఉస్మానియా, మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయాలు జూన్‌ 17వ తేదీ నుంచి, పాలమూరు విశ్వవిద్యాలయం జూన్‌ 19వ తేదీ నుంచి, తెలంగాణ వర్సిటీ 26వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో విద్యార్థులే కాదు.. అధ్యాపకుల్లోనూ గందరగోళం నెలకొంది.

విద్యార్థుల్లో అయోమయం..
ఓవైపు పరీక్షలు పూర్తి కాకుండానే యూనివర్సిటీలు మరుసటి విద్యాసంవత్సరం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడం చూసి విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారుల అసమర్థత వల్ల మండుటెండల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అసలు పరీక్షలు పూర్తి కాకుండా తరగతులకు ఎలా హాజరవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక విద్యాసంవత్సరం పూర్తి చేసి పరీక్షలు రాసిన విద్యార్థులకు కనీసం రెండు వారాలైనా సెలవులు ఉండాలని ఆ తర్వాతే తరగతులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. పరీక్షల నిర్వహణలో అసమర్థత వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ ఎంట్రన్స్‌ రాయలేకపోయారని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఐసెట్, లాసెట్‌ లాంటి పరీక్షలకు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, ఫలితంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు.

ఈసారి అయినా పక్కా చర్యలు చేపట్టాలి
కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ అన్ని యూనివర్సిటీల్లో అమలు చేసేలా చూడాలని ఉన్నత విద్యామండలిని మే మొదటి వారంలోనే తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్‌ అధ్యాపక సంఘం కోరింది. అయినప్పటికీ ఉన్నత విద్యా మండలి పూర్తిస్థాయిలో శ్రద్ధ కనబరచడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ సంజీవయ్య, డాక్టర్‌ కె.సురేందర్‌రెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తమకు స్వేచ్ఛ ఉందని, ఎవరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top