కాంగ్రెస్‌ కసరత్తు దాదాపు పూర్తి | The completion of the Lok Sabha candidates is almost complete | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కసరత్తు దాదాపు పూర్తి

Feb 28 2019 4:00 AM | Updated on Mar 18 2019 7:55 PM

The completion of the Lok Sabha candidates is almost complete - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఖరారు కసరత్తు దాదాపు పూర్తయింది. దీనికోసం బుధవారం ఢిల్లీలోని వార్‌ రూంలో రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జులు సలీం అహ్మద్, శ్రీనివాసన్, బోసురాజు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ సమావేశమై డీసీసీల నుంచి వచ్చిన ఆశావహుల జాబితాపై చర్చించారు. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాలకు గాను మూడు స్థానాలు మినహా అన్ని చోట్లా రెండు పేర్ల వరకు జాబితా కుదించినట్టు తెలుస్తోంది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ జాబితా కుదింపు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మూడింటికి ఒక్కరేనా..!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెదక్, నిజామాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది. అనివార్య సమీకరణల్లో మారితే తప్ప మెదక్‌ నుంచి గాలి వినోద్‌కుమార్, నిజామాబాద్‌ నుంచి మధుయాష్కీగౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబా బాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో రెండు పేర్ల చొప్పున ఖరారు చేసినట్టు సమాచారం. ఇక, ఖమ్మం, నల్లగొండ, భువనగిరిల్లో మాత్రం పోటీ ఎక్కువగా ఉండడంతో మరింత చర్చ జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

ఐదు సర్వేల ఆధారంగా!
లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఐదు సర్వేలను పూర్తి చేసిందని, ఈ సర్వేల ఫలితాలను కూడా అభ్యర్థుల ఖరారులో పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానం నాలుగు సర్వేలు చేయించగా, టీపీసీసీ పక్షాన ఓ సర్వే నిర్వహించారు. కాగా, స్క్రీనింగ్‌ కమిటీలో ఖరారు చేసిన పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతారని, ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడి అభిప్రాయంతో పాటు ఆమోదం కూడా తీసుకుని మార్చి మొదటివారంలో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. కాగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎంపీ టికెట్ల రేసులో ఉన్నవారి పేర్లు ఇలా ఉన్నాయి.

ఎంపీ టికెట్ల రేసులో ఉన్న పేర్లు

మెదక్‌: గాలి అనిల్‌కుమార్‌
నిజామాబాద్‌: మధుయాష్కీ;
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి;
మహబూబ్‌నగర్‌: ఎస్‌.జైపాల్‌రెడ్డి/వంశీచంద్‌రెడ్డి;
కరీంనగర్‌: పొన్నం ప్రభాకర్‌/ నేరెళ్ల శారద;
ఆదిలాబాద్‌: నరేశ్‌ జాదవ్‌/ సోయం బాపూరావు;
వరంగల్‌: డాక్టర్‌ రాజమౌళి/విజయ్‌కుమార్‌ మాదిగ;
మహబూబాబాద్‌: బలరాం నాయక్‌/రాములు నాయక్‌;
పెద్దపల్లి: కవ్వంపల్లి సత్యనారాయణ/ఊట్ల వరప్రసాద్‌;
నాగర్‌కర్నూలు: సంపత్‌/మల్లురవి;
మల్కాజ్‌గిరి: కూన శ్రీశైలంగౌడ్‌/బండ కార్తీకరెడ్డి;
హైదరాబాద్‌: అజారుద్దీన్‌/ఫిరోజ్‌ఖాన్‌;
సికింద్రాబాద్‌: అంజన్‌కుమార్‌ యాదవ్‌/ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి;
జహీరాబాద్‌: మదన్‌మోహన్‌/జైపాల్‌రెడ్డి (బాగారెడ్డి తనయుడు);
నల్లగొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి/పద్మావతిరెడ్డి/పటేల్‌ రమేశ్‌రెడ్డి/రఘువీర్‌రెడ్డి;
భువనగిరి: కసిరెడ్డి నారాయణరెడ్డి/గూడూరు నారాయణరెడ్డి/వంగాల స్వామిగౌడ్‌;
ఖమ్మం: రాజేంద్రప్రసాద్‌/వి.హనుమంతరావు/రేణుకాచౌదరి/ పొంగులేటి సుధాకర్‌రెడ్డి/గాయత్రి రవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement