బుస్..స్‌స్ | Coming out of the snakes are common during the rainy season | Sakshi
Sakshi News home page

బుస్..స్‌స్

Jul 20 2014 2:44 AM | Updated on Oct 8 2018 5:04 PM

బుస్..స్‌స్ - Sakshi

బుస్..స్‌స్

వర్షాకాలంలో పాములు బయటకు రావడం సాధారణం. రాత్రివేళ ఇది ఎక్కువగా ఉంటుంది. పాముకాట్లు కూడా ఈ సీజన్‌లోనే అధికంగా ఉంటాయి.

సాక్షి, మహబూబ్‌నగర్: వర్షాకాలంలో పాములు బయటకు రావడం సాధారణం. రాత్రివేళ ఇది ఎక్కువగా ఉంటుంది. పాముకాట్లు కూడా ఈ సీజన్‌లోనే అధికంగా ఉంటాయి. ఈ విషయం తెలిసినా వైద్య ఆరోగ్యశాఖ కనీస ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లాలో జూలైనుంచి ఇప్పటి వరకు 35మంది పాముకాటుకు గురయ్యారు. జూలై నెల మొదటి వారంలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
 
 ఇందులో అధికంగా గ్రామీణప్రాంత వాసులు, గిరిజనులే. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పాములు పుట్టలోనుంచి బయటకు వచ్చి తిరుగుతుంటాయి. అవి ఇళ్లలోకి చేరి పడుకున్న వారిని కాటేస్తున్నాయి. పాముకాటుకు గురైన వారిని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తే పాముకాటు విరుగుడుకు వాడే యాంటీ స్నేక్ వీనమ్ (ఏవీఎస్) మందు దొరకడం లేదు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితులను వంద కిలోమీటర్లకు పైగా దూరం నుంచి మహబూబ్‌నగర్‌కు తీసుకువచ్చే సరికి ఆలస్యం జరిగి విషం శరీరమంతా వ్యాపించి మార్గమధ్యంలోనే మరణిస్తున్నారు.  
 
 పీహెచ్‌సీలలో ఏవీఎస్ నిల్
 పాముకాటుకు గురవుతున్న గ్రామీణవాసులు అత్యంత దుర్భర పరిస్థితిని చవిచూస్తున్నారు. రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో విషసర్పాల బారిన పడి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వద్దకు బాధితులను తీసుకెళ్తే అక్కడ విషం విరుగుడు మందు ఉండడం లేదు. చాలా పీహెచ్‌సీలలో ఏవీఎస్ మందు లేక ప్రధాన ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా పాముకాటు నివారణ (ఏవీఎస్) మందులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
 
 పాముకాటుకు వైద్యమిలా...
 పాముకాట్లకు విరుగుడుగా యాంటీ స్నేక్ వీనం (ఏవీఎస్)ను అందిస్తారు. విషం తీవ్రతను బట్టి వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాసనందిస్తూ ఐవీ ప్లూయిడ్స్‌తో పాటు యాంటీబయాటిక్స్ వాడుతారు. పాముకాటుకు గురైన వారికి కనీసం 24 నుంచి 48 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచాలి. పాముకాటు వేసిన గంటలోపే చికిత్స అందిస్తే మెరుగైన ఫలితముంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది గ్రామీణులు నాటువైద్యులను ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.
 
 నాటుమంత్రాన్ని ఆశ్రయిస్తే...
 తలకొండపల్లి మండలం సాలార్‌పూర్ తండాకు చెందిన వడ్యావత్ నారాయణ, లలితల కుమార్తె మహాలక్ష్మి (10). ఈ నెల 6వ తేదీన ఆమెను పాముకాటు వేసింది. అయితే, మహాలక్ష్మి తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి కాకుండా మంత్రగాళ్ల వద్దకు తీ సుకెళ్లారు. అక్కడ చాలాసేపు ఉంచారు. ఈ లోపు విషమంతా బాలిక శరీరం మొత్తం వ్యాపించింది. అక్కడికక్కడే నురగలు కక్కుకుంటూ తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణం విడిచింది.
 
 వెంటనే చికిత్స అందించాలి
 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో పాముకాటు బాధితుల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా కప్పలు, ఎలుకలు ఉన్న ప్రాంతాల్లో పాముల సంచారం అధికం. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుకు గురైనవారు చాలా మంది వెంటనే చికిత్స తీసుకోకుండా మంత్రగాళ్లను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పాముకాటుకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రథమచికిత్స అనంతరం గంట వ్యవధిలో ఆసుపత్రికి తీసుకెళ్లి యాంటీ స్నేక్ వీన ం మందు అందేలా చూడాలి. రెండు రోజుల పాటు డాక్టర్ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి.
 -కె.అమరేందర్‌రెడ్డి, నిష్ణాతులు, జువాలజీ టీచర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement