గుట్ట దిగి రండి..

Come Down From Hill - Sakshi

గొత్తికోయలకు తహసీల్దార్‌ సూచన

కాలినడకన మూడు కిలోమీటర్లు

అశ్వారావుపేటరూరల్‌: వారంతా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఎత్తయిన గుట్టపై దాదాపు ఇరవై ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జనావాసాలకు దూరంగా ఉంటున్నారు. వారికి, వారి పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. తాగునీరు, రోడ్డు, విద్యుత్‌ తదితర ఎలాంటి సౌకర్యాలూ లేవు. ఆ గొత్తికోయల గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. దాంతో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఈ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. ఇలాంటి ఈ ప్రాంతానికి తొలిసారిగా ఓ తహసీల్దార్‌ ఆదివారం కాలినడకన వెళ్లడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.

. మండలంలోని మొద్దులమడ గ్రామ రెవెన్యూ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్దమిద్దె అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే మొద్దులమడ అటవీ ప్రాంతం నుంచి రెండు వాగులు దాటి మూడు కిలోమీటర్ల మేర కాలిబాటలో వెళ్లాలి. ఆ తర్వాత ఎత్తయిన గుట్టపై వలస గొత్తికోయల స్థిర నివాసాలు కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో తాగునీరు. విద్యుత్, అంగన్‌వాడీ, పాఠశాల వంటివి మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి ప్రాంతానికి తహసీల్దార్‌ రాఘవరెడ్డి వెళ్లి గోత్తికోయలతో దాదాపు రెండు గంటల పాటు గడిపారు.

వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ఏళ్లుగా గుట్టపై నివాసం ఉండటం వల్ల వారంతా పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ప్రాంతాన్ని వదిలి గుట్ట దిగి కిందకు రావాలని సూచించారు. గుట్ట దిగి వస్తే మొద్దులమడ గ్రామం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. కిందకు వస్తే ప్రభుత్వ పరంగా తాము సహకరిస్తామని, కనీస సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు. అప్పటి వరకు పిల్లలను మొద్దులమడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి పంపించాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top