వారికి మాత్రమే జీతాలు : కేసీఆర్‌

CM KCR Review Meeting On TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగడం లేదు. కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తుంటే.. యూనియన్లతో చర్చలు జరిపేదే లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. సమ్మె చేస్తున్న వారితో ఎలాంటి చర్చల్లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై శనిరవారం ఆయన ప్రగతి భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నయ ఏర్పాటు, కొత్త నియామకాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. 

సమ్మెలో ఉన్నవారికి జీతాలు ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ప్రజల్ని, ఆర్టీసీకి నష్టం కలిగించిన కార్మికులను క్షమించేది లేదన్నారు. చట్ట విరుద్ద సమ్మెను ప్రభుత్వం గుర్తించదని,  విధుల్లో ఉన్నవారికి మాత్రమే జీతాలు చెల్లిస్తామన్నారు. విధుల్లో చేరనివారిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. యూనియన్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అలాగే ఆర్టీసీ సమ్మెకారణంగా విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడగించారు. ఈ నెల 19వ తేదీ వరకూ సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు... ప్రభుత్వం బెదిరింపులను పట్టించుకోకుండా తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. 13న వంటావార్పు, 14న డిపోల ముందు భైఠాయింపు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, 17న ధూందాం, 18న బైక్‌ ర్యాలీలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top