కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR High Level Review Meeting On Coronavirus Prevention - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితరులు హాజరయ్యారు.
(కరోనా@తెలంగాణ: 1001కి చేరిన కేసులు) 

మరికొన్ని రోజుల వరకు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు(సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు.  హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితిని  సమీక్షించిన సీఎం.. ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు సరిగ్గా అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యలను ఆరా  తీశారు. కంటైన్మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాల సరుకులు అందచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మరణాలు రేటు జాతీయ సగటు కన్నా తక్కువ వుండడం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగించడంతో పాటు.. ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని  సీఎం అన్నారు. ‘‘సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశ వ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా రేపటి కాన్ఫరెన్స్ లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top